calender_icon.png 24 October, 2024 | 4:08 AM

ప్రధానిలా ఊహల్లో రాహుల్

22-07-2024 02:59:09 AM

  1. 100 సీట్లు రాకున్నా ఊహలకేం తక్కువ లేదు.. 
  2. రాష్ట్రపతి ప్రసంగంపై తప్పుడు ఆరోపణలు 
  3. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు కూడా సాధించలేదని, అయినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినట్లు ఊహల్లో  తేలియాడుతున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల్లో ఓడిపోయినా సంబరాలు చేసుకునే పార్టీని దేశ రాజకీయాల్లో మొదటిసారిగా చూస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయిన అసహనంతో పార్లమెంటు సమావేశాల్లో రాష్ర్టపతి ప్రసంగంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అబద్ధాలు, తప్పుడు ఆరోపణలతో విషం చిమ్మారని ఆరోపించారు.

ఆదివారం సోమాజిగూడ జయ గార్డెన్‌లో జరిగిన సికింద్రాబాద్ సెంట్రల్ జిల్లా విసృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం మరోసారి బయటపడుతుందని, లోక్ సభ జరగకుండా అడ్డుపడటంతో పాటు  రాజ్యాంగం గురించి అబద్దాలు ప్రచారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరించేందుకు సిద్ధమైందన్నారు. ఈ విషయాన్ని ప్రజ లు గమనించాలని కేంద్ర మంత్రి కోరారు.

దేశవ్యాప్తంగా కూడా మతోన్మాద శక్తులు కాంగ్రెస్ గొడుగు కింద పోటీ చేసి బీజేపీని ఓడించేందుకు కుట్ర చేశాయని.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ప్రచారం చేసు కోవచ్చని, కానీ దేశ వ్యతిరేక శక్తులు, తీవ్రవాద శక్తులు చాపకింద నీరులా వ్యాపించి, మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా అనేక కుతంత్రాలు చేశాయన్నారు. దేశాన్ని చీల్చడం, దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం కల్పించడమే వారి ఉద్దేశమని విమర్శించారు. సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మజ్లిస్‌తో కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడి బీజేపీ మెజారిటీ తగ్గేలా చేసిందని అన్నారు. బొగ్గు కుంభకోణం, కామన్ వెల్త్ కుంభకోణం, 2 జీ స్పెక్ట్రమ్ కుంభకోణం వంటి అనేక కుంభకోణాలతో సుమారు రూ. 12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని దుయ్యబట్టారు.