22-03-2025 01:07:24 AM
అసమానతలు, వివక్ష వాస్తవాలు బయటికి
విద్యావేత్త సుఖ్‌దేవ్ థోరట్‌తో చర్చ
న్యూఢిల్లీ: దేశంలో కుల గణన ఆవశ్యకతను ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోమారు నొక్కి చెప్పారు. కులగణన దేశంలోని అసమానతలు, వివక్ష వాస్తవ రూపాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ఉపయోగపడనుందని తెలిపారు. యూజీసీ మాజీ చైర్మన్, విద్యావేత్త సుఖ్‌దేవ్ థోరట్‌తో చిట్‌చాట్ చేసిన వీడియోలు రాహుల్ తాజాగా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘1927 మార్చి 20న మహద్ సత్యాగ్రహ ద్వారా కుల వివక్షను అంబేద్కర్ నేరుగా సవాల్ చేశారు. అది కేవలం తాగునీటిపై హక్కు కోసం పోరాటం ఎంతమాత్రం కాదు. అది సమానత్వం, గౌరవం కోసం సాగిన పోరాటం. హక్కుగా రావాల్సిన వాటా కోసం 98 ఏళ్ల క్రితమే ఈ పోరాటం మొదలైంది.
ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అసమానతలు, వివక్ష అసలు రూపాన్ని బయటకు తీయడంలో కుల గణనది ముఖ్యమైన అడుగు. అయితే దానిని బయటపెట్టడాన్ని ప్రత్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ కల ఇంకా అసంపూర్ణంగానే ఉంది. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మా శక్తులన్నింటిని కూడదీసుకొని పోరాడుతాం’ అని చెప్పుకొచ్చారు. ఇక ప్రతిభ ఆధారంగా అవకాశాలు అనేది అగ్రకుల భావన కిందకు వస్తోందని రాహుల్ పేర్కొన్నారు. ఇది సహేతుకం కాదన్నారు. విద్యా వ్యవస్థలో కానీ, బ్యూరోక్రాటిక్ వ్యవస్థలో కానీ దళితులు, ఓబీసీలు, గిరిజనులకు న్యాయం జరుగుతుందని భావిస్తే అది తప్పేనని స్పష్టం చేశారు. అయితే రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ప్రతిభ ఆధారంగా అవకాశాలు అనేది అగ్రకుల భావం అని రాహుల్ పేర్కొనడం ‘కాంగ్రెస్ ఫ్యూడల్ మైండ్ సెట్’ను బయటపెట్టిందని విమర్శించింది.