ఇషాన్, శ్రేయస్‌లను అందుకే తప్పించాం
బీసీసీఐ కార్యదర్శి జై షా
ముంబై: టీమిండియా క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించడం వెనుక బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌దే కీలకపాత్ర అని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. తాను కేవలం కన్వీనర్‌ను మాత్రమేనని వారిని తప్పించడంలో తన పాత్ర ఏమి లేదని జై షా పేర్కొన్నాడు. శుక్రవారం ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జై షా పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. చీఫ్ సెలెక్టర్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించే బాధ్యత కార్యదర్శిదని జై షా తెలిపాడు. ‘మీరు ఒకసారి బీసీసీఐ రాజ్యాంగాన్ని పూర్తిగా చదవండి. నేను కేవలం కన్వీనర్‌ను మాత్రమే. జట్టు ఎంపికలో నా పాత్ర చాలా తక్కువ. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించడం వెనుక చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌దే కీలకపాత్ర. దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు ఆసక్తి చూపకపోవడంతోనే వాళ్లిద్దరిని పక్కనబెట్టాలని అజిత్ భావించాడు. నా పాత్ర కేవలం అమలు చేయడం వరకే ఉంటుంది. వారికి బదులు కొత్త ఆటగాళ్లకు అవకాశమిచ్చాం. దీంతో సంజూ శాంసన్‌కు కాంట్రా క్ట్‌లో చోటు దక్కింది. అయితే ఇషాన్, అయ్యర్‌లతో నేను ప్రత్యేకంగా మాట్లాడా. ఇదే విషయమై మీడియాలోను కథనాలు వచ్చా యి. ఏ ఆటగాడైనా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతి తీసుకుంటే పర్వాలేదు’ అని పేర్కొన్నాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ అవసరమా!
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జై షా స్పందించాడు. ఈ రూల్ శాశ్వతం కాదని వెల్లడించాడు. ‘ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను కేవలం టెస్టింగ్ కోసం ప్రవేశపెట్టాం. ఇలా చేయడం వల్ల కొత్తగా ఇద్దరు భారత క్రికెటర్లకు ఆడే అవకాశం వస్తుంది. ఇంపాక్ట్ రూల్ పై వస్తున్న విమర్శల గురించి త్వరలోనే చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. వచ్చే సీజన్‌లో కొనసాగించాలా? వద్దా? అనేది ఇప్పుడే చెప్పలేం. నిర్ణయం తీసుకునే ముందు ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్లతో మాట్లాడతాం. ఇంతవరకు రూల్‌పై ఎవరి నుంచి ఫీడ్‌బ్యాక్ రాలేదు’ అని వెల్లడించాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లండ్‌లోనే ఎందుకు..
టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు సమతూకంగా ఉందని జై షా అన్నాడు. అటు అనుభవజ్ఞులు, ఇటు యువకులతో జట్టు బలంగా ఉందని మెగాటోర్నీలో మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అత్యుత్తమ 15 మందిని ఎంపిక చేయడం వల్ల.. ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగలవారు జట్టులో ఉన్నారని అన్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను ప్రతిసారి ఇంగ్లండ్‌లోనే నిర్వహించకుండా.. మిగిలిన దేశాలకు కూడా అవకాశం ఇచ్చేలా ఐసీసీతో చర్చిస్తున్నట్లు జై షా వెల్లడించాడు. టెస్టు క్రికెట్‌ను మరింత విస్తరించేలా చేయడానికి కృషి చేస్తున్నామని.. ఇందులో భాగంగానే ఆటగాళ్లకు అందించే ప్రోత్సాహకాలను భారీగా పెంచినట్లు జై షా తెలిపాడు.