30-04-2024 12:20:00 AM
ప్రధాని మోదీ మంగళసూత్రాల విమర్శలపై రాహుల్ కౌంటర్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేపడుతాం
రూ.24 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స
దేశమంతా మహాలక్ష్మి పథకం అమలు
మీడియాకు రైతుల కష్టాలు కనిపించవు
పటాన్ (గుజరాత్), ఏప్రిల్ 29: కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ.. మంగళసూత్రాలు కూడా లాక్కుంటారంటూ కాంగ్రెస్ ను దుయ్యబడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరోక్షంగా మోదీకి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం గుజరాత్‌లోని పటాన్‌లో జరిగిన ఎన్నికల సభ లో రాహుల్ మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.24 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స అందించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు తమ మంగళసూత్రాలు అమ్ముకోవాల్సిన అవసరం రాదంటూ మోదీకి కౌంటర్ ఇచ్చారు.
తాము అధికారంలోకి వస్తే మహాలక్ష్మి యోజన పథకాన్ని అమలు చేస్తామని, ఈ పథకం కింద పేద కుటుంబాలను గుర్తించి, ఆ కుటుంబానికి నెలకు రూ.8,500 నేరుగా ఆ మహిళల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతోందని, దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉంటుందా లేదా అనేదే పెద్ద ప్రశ్న అని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దేశంలో రాజ్యాంగం లేకుండా చేయాలని చూస్తున్నాయంటూ పునరుద్ఘాటించారు. అయితే కాంగ్రెస్, ఇండియా కూటమి రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తోందని చెప్పారు.
ఆర్థిక సర్వేపై తగ్గేదే లే
కుల గణన, ప్రజల ఆర్థిక సర్వేపై ప్రధాని మోదీ ఎన్ని విమర్శలు చేసినా తగ్గేదే లే అన్నట్టు రాహుల్ గాంధీ దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా ప్రాధాన్యతపరంగా కులగణన, ఆర్థిక సర్వే చేస్తామని స్పష్టం చేశారు. ‘దేశంలో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారు. కానీ కార్పొరేట్, మీడియా రంగాల్లో, ప్రైవేటు ఆస్పత్రుల్లో, ప్రైవేటు యూనివర్సిటీల్లో, ప్రభుత్వ యంత్రాగంలో వారి భాగస్వామ్యం ఎక్కడా కనిపించట్లేదు. అందుకే ముందుగా మేం అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన, ప్రజల ఆర్థిక సర్వే చేపడుతాం’ అని కరాఖండీగా చెప్పారు. రైతుల రుణ మాఫీ చేయలేదు కానీ.. 2,225 మంది ధనవంతులకు చెందిన రూ. 16 లక్షల కోట్ల రుణాలు మాత్రం మాఫీ చేశారని రాహుల్ చెప్పారు.
అవే పెద్ద సమస్యలు..
దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల చాలా పెద్ద సమస్యలు. కానీ వీటిని మీరు టీవీల్లో చూడరు. ఎందుకంటే మీడియా ఎప్పుడూ పేదలకు సంబంధించిన వార్తలు చూపించదు. ఎప్పుడూ నరేంద్రమోదీ, సెలబ్రిటీల వార్తలే కనిపిస్తుంటాయి. కానీ రైతుల సాదకబాధకాలు మాత్రం కనిపించవు’ అని దుయ్యబట్టారు.