రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు
జ్యోతిర్‌మఠ్ అధిపతి శంకరాచార్య ఆవిముక్తేశ్వరానంద్ సరస్వతి
డెహ్రాడూన్, జూలై 8 : హిందుత్వం పేరుతో బీజేపీ హింసకు పాల్పడుతోందని రాహుల్‌గాంధీ లోక్‌సభలో శివుని బొమ్మ చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతలతో పాటు అనేక మంది రాహుల్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్‌మఠ్ అధిపతి, శంకరాచార్య ఆవిముక్తేశ్వరానంద్ సరస్వతి సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం అంటే భయం, విద్వేషం, అసత్యాలను వ్యాప్తి చేయడం కాదన్నారు. “హిందూ మతానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని విన్న తర్వాత నేను ఆ మొత్తం వీడియోను చూశాను.
ఆయన ఏదీ తప్పుగా మాట్లాడలేదని నాకు అర్థమైంది. హిందూ మతంలో హింసకు స్థానం లేదని రాహుల్ చెప్పిన మాట ముమ్మాటికీ సరైనదే. రాహుల్ చేసిన వ్యాఖ్యలు అధికార బీజేపీ పార్టీ గురించే కానీ హిందూ మతం గురించి కాదు. ఇదే విషయాన్ని రాహుల్ తన ప్రసంగంలోనే స్పష్టతనిచ్చాడు. రాహుల్ గాంధీ ఉపన్యాసాలను ఎడిట్ చేసి కొందరు అసత్యాలను ప్రచారం చేశారు. ఇలా చేయడం నేరం. ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారం చేసే వారిని కఠినంగా శిక్షించాలి” అని ఆయన పేర్కొన్నారు. కాగా, జూలై2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాణం సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్.. బీజేపీ, ఆరెస్సెస్ మాత్రమే హిందూ మతానికి ఏకైక ప్రతినిధులు కాదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే అధికార బీజేపీ సభ్యుల ఆగ్రహానికి కారణమయ్యాయి.