calender_icon.png 18 November, 2024 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్

18-11-2024 12:25:55 AM

  1. ఖమ్మం ప్రభుత్వ కాలేజీలో ఫస్టియర్ విద్యార్థికి గుండు గీయించిన ప్రొఫెసర్
  2. నల్లగొండలో మద్యం మత్తులో జూనియర్లను వేధించిన సీనియర్లు
  3. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ మంత్రి దామోదర ఆదేశాలు 

ఖమ్మం, నవంబర్ 17 (విజయక్రాంతి): ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మెడికో విద్యార్థికి అసిస్టెంట్ ప్రొఫెసరే గుండు కొట్టించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తోటి విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే అరికట్టాల్సిన ప్రొఫెసరే మెడికోపై ర్యాగింగ్‌కు పాల్పడటంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు.

ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ నెల 12న అడ్మిషన్ తీసుకుని, అదే రోజు హాస్టల్‌లో చేరాడు. అయితే ఆ విద్యార్థి హెయిర్ కటింగ్ చైనీస్ తరహాలో ఉండటంతో సెకండ్ ఇయర్ విద్యార్థులు హేళన చేశారు. సాధారణ కటింగ్ చేయించుకోవాలని సూచిస్తూనే కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్‌చార్జి కూడా అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో రెహమాన్ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే కటింగ్ సరిచేయించుకోవాలని మెడికోను ఆదేశించాడు. సదరు విద్యార్థి అదే రోజు రాత్రి సమీపంలోని సెలూన్‌కు వెళ్లి హెయిర్ కటింగ్‌కు ట్రిమ్ చేయించుకుని కళాశాలకు వెళ్లాడు. అయినా కూడా సెకండియర్ విద్యార్థులు మళ్లీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ విద్యార్థిని ఇబ్బంది పెట్టినట్లు సమాచారం.

దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్ ఆ విద్యార్థిని మళ్లీ మందలించడమే కాకుండా తన బైక్‌పై ఎక్కించుకుని, సెలూన్ షాపునకు తీసుకెళ్లి పూర్తిగా గుండు కొట్టించాడు. మనస్థాపానికి గురైన సదరు విద్యార్థి ఈ నెల 13న కళాళాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు సీనియర్ విద్యార్థులతోపాటు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌పైనా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్‌ను కోరారు. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ అంతర్గతంగా విచారించి, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను హాస్టల్ ఇన్‌చార్జి బాధ్యత ల నుంచి తప్పించారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించి ప్రాథమిక విచారణ నివేదికను ఉన్నతాధికారులకు కూడా పంపినట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్ తనకు అనుకూలంగా సెకండియర్ విద్యార్థుల చేత లెటర్ కూడా రాయించుకున్నారనే ప్రచారం జరుగుతుంది. సెకండియర్ విద్యార్థుల ప్రొద్బలం తోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ విధంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఫోర్‌మెన్ కమిటీని నియమించామని చెప్పారు. కమిటీ ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.  

ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలి

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (విజయక్రాంతి): ఖమ్మం, నల్లగొండ మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, టీ నాగరాజు డిమాండ్ చేశారు. కాలేజీ హాస్టళ్లు, తరగతి గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలని, జిల్లా ఎస్పీలు మెడికల్ కాలేజీలను సందర్శించాలని కోరారు. కళాశాలల్లో స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించాలని కోరారు.

నల్లగొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ 

నల్లగొండ, నవంబర్ 17 (విజయక్రాంతి): నల్లగొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం సృష్టించింది. ఇటీవల కేరళకు చెందిన జూనియర్ వైద్య విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. బాధిత విద్యార్థులు ఈ నెల 12న కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. అసభ్యంగా మాట్లాడి తాము చెప్పినట్లు వినాలని కొందరు సీనియర్లు వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.

ఘటనపై విచారణ జరిపిన యాంటీ ర్యాగింగ్ కమిటీ ఓ జూనియర్ డాక్టర్, ముగ్గురు విద్యార్థులు మద్యం మత్తులో ర్యాగింగ్‌కు పాల్పడినట్లు గుర్తించి కలెక్టర్, వైద్య విద్యా సంచాలకులకు నివేదిక సమర్పించింది. దీంతో ర్యాగింగ్ పాల్పడిన రెండో సంవత్సరం విద్యార్థిని నెల రోజులపాటు, నాలుగో సంవత్సరం చదువుతున్న ఇద్దరితోపాటు జూనియర్ డాక్టర్‌ను మూడు నెలల పాటు అధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది.

చాలాకాలంగా మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరుగుతున్నా అధ్యాపకులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. కళాశాలలో ర్యాగింగ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని విదార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

ర్యాగింగ్ చేసిన కఠిన చర్యలు

మంత్రి దామోదర రాజనర్సింహ 

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి, తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అన్ని కాలేజీల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఇందుకు పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలన్నారు. ర్యాగింగ్ వల్ల విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం పడకుండా చూడాలని ఉన్నతాధికారులను మంత్రి సూచించారు. జూనియర్లతో సీనియర్ స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా ఉండాలి తప్పితే, ర్యాగింగ్ పేరిట వారిని భయాందోళనకు గురి చేయవద్దని కోరారు.