03-03-2025 02:25:00 PM
సిగరెట్ తాగాలంటూ విద్యార్థిని బెదిరించిన ఇంటర్ విద్యార్థులు
ర్యాగింగ్ సమాచారం ఇచ్చిన టెన్త్ విద్యార్థిని చితకబాదిన వైనం
ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల (సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్) లో సోమవారం చక్రధర్ అనే 8 వ తరగతి విద్యార్థిని బట్టలు విప్పి సిగరెట్ తాగాలంటూ ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసిన సంఘటన కలకలం రేపింది. కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడుతున్న విషయాన్ని ప్రిన్సిపల్ శ్రీధర్ కు పదవ తరగతి విద్యార్థి నిఖిల్ తెలపడంతో అతన్ని కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు కళాశాలలో చితకబాదారు. ఈ రెండు సంఘటనలతో బెల్లంపల్లి సి ఓ ఈ లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కళాశాలలో విద్యార్థులపై దాడి చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కళాశాల ప్రారంభం నుండి క్రమశిక్షణకు, ఉత్తమ ఫలితాలకు కేరాఫ్ గా నిలిచింది.
కళాశాలలో విద్యార్థుల ప్రతిభా పాటవాలు, టెన్త్, ఇంటర్మీడియట్ తో పాటు ఎంసెట్, ఐఐటి, జేఈఈ, నీట్ ఫలితాల్లో ర్యాంకుల ప్రభంజనం తో రాష్ట్రస్థాయిలో ఈ కళాశాల అరుదైన గుర్తింపు పొందింది. అత్యుత్తమ బోధనలో గురుకులాలకే వన్నెతెచ్చింది. గతంలో ఇక్కడ ప్రిన్సిపల్ గా పనిచేసిన ఐనాల సైదులు నేతృత్వంలో అధ్యాపక బృందం ఫలితాల సాధనకు కృషి చేసింది. బదిలీల్లో భాగంగా ప్రిన్సిపాల్ ఐనాల సైదులు గత సంవత్సరం జూలై 13న ఖమ్మం ఖమ్మం జిల్లాకు బదిలీ కావడంతో ముదోల్ మండలం బాలుర గురుకులం ప్రిన్సిపల్ శ్రీధర్ బెల్లంపల్లి సిఓఈ ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టారు. 6 నెలల కాలంగా కళాశాలలో విద్యా సంబంధిత కార్యక్రమాలు ఎక్కడా కనిపించలేదు. ఈ క్రమంలో కళాశాలలో ఇంటర్ విద్యార్థులు రాగింగ్ కు పాల్పడడం ఉపాధ్యాయుల బాధ్యత రాహిత్యాన్ని స్పష్టం చేసింది. ఇప్పటికైనా కళాశాలలో విద్యార్థుల విద్యా సంబంధిత కార్యక్రమాలపై దృష్టి సాధించడంతోపాటు ర్యాగింగ్ చర్యలను అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు,తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.