calender_icon.png 13 January, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రావ్స్ కోచింగ్‌పై రగడ

29-07-2024 01:49:18 AM

  1. బేస్‌మెంట్ వరదలో ముగ్గురు మృతి
  2. మృతుల్లో మంచిర్యాల విద్యార్థి తానియా సోని
  3. బేస్‌మెంట్‌లో అక్రమంగా లైబ్రరీ నిర్వహణ
  4. ఘటనపై కోచింగ్ సెంటర్ ఎదుట నిరసనలు

న్యూఢిల్లీ, జూలై 28: ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన రావ్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్‌లో నీటి వరదలో చిక్కుకొని మృతిచెందినవారి సంఖ్య మూడుకు చేరింది. శనివారం రాత్రి భారీ వర్షాలకు బేస్‌మెంట్‌లోని భారీగా నీరు ఒక్కసారికి పోటెత్తటంతో అక్కడ చదువుకొంటున్న విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. మృతుల్లో తెలంగాణకు చెందిన తానియా సోని అనే విద్యార్థి కూడా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఆమె ఆ కోచింగ్ సెంటర్‌లో చేరారు.

శ్రేయా యాదవ్, నవీన్ దెల్వీ అనే విద్యార్థులు కూడా ఈ ఘటనలో మృతి చెందారు. శ్రేయాది ఉత్తరప్రదేశ్ కాగా, నవీన్ కేరళవాసి. భవిష్యత్తుపై కోటి ఆశలతో వెళ్లిన విద్యార్థులు అనూహ్యంగా మృత్యువాత పడటంతో అక్కడ కోచింగ్ తీసుకొంటున్న తోటి విద్యార్థులు భగ్గుమన్నారు. శనివారం రాత్రి నుంచి కోచింగ్ సెంటర్ ఎదుట ధర్నా చేస్తున్నారు. వారికి బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకుల నుంచి మద్దతు లభిస్తున్నది. 

సోనీది శ్రీరాంపూర్

హైదరాబాద్ సిటీబ్యూరో/మంచిర్యాల (విజయక్రాంతి): రావ్స్ కోచింగ్ సెంటర్ ఘటనలో మరణించిన తానియా సోని తండ్రి విజయ్‌కుమార్ సింగరేణి సంస్థ ఉద్యోగి. ఎస్‌ఆర్‌పీ ఆయన మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మంచిర్యాల సమీపంలోని నస్పూర్ బంగ్లాస్‌లోనే వారి కుటుంబం నివాసం ఉంటున్నది. తానియా సోని పాఠశాల విద్యాభ్యాసం అంతా మంచిర్యాలలో జిల్లాలోనే సాగింది. ఆమె ఇటీవలే సివిల్స్ కోసం ఢిల్లీ వెళ్లారు. తానియా మృతి వార్త మంచిర్యాల, శ్రీరాంపూర్ ప్రాంతంలో విషాదం నింపింది. 

తానియా సోని తండ్రికి కిషన్‌రెడ్డి పరామర్శ

తానియా సోని మృతిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె తండ్రి విజయ్‌కుమార్‌ను ఫోన్‌లో పరామర్శించారు. విద్యార్థిని భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా కుటుంబసభ్యులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలోని తన కార్యాలయ సిబ్బందికి కిషన్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. ఢిల్లీలో రాష్ట్ర విద్యార్థిని దుర్మరణం చాలా బాధాకరమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తానియా మృతదేహాన్ని వెంటనే రాష్ట్రానికి తెచ్చే ఏర్పాట్లు చేయాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ను ఆదేశించారు.