లక్నో, ఆగస్టు 4: అయోధ్యలో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేయడం వివాదస్పదమైంది. ఆయనపై ఉత్తరప్రదేశ్‌లోని పలు రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జూలై 30న బాలికపై అత్యా చారం చేసిన ఘటన వెలుగు చూడగా పోలీసులు బదర్సానగర్‌లో బేకరి నడుపుతున్న సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్త మోయిద్ ఖాన్‌తో పాటు బేకరి వర్కర్ రాజుఖాన్‌ను అరెస్ట్ చేశారు. వీరు 12 ఏళ్ల బాలికపై రెండు నెలల పాటు లైంగిక దాడి జరిపారని, ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చిందనే ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ నిందితులకు డీఎన్‌ఏ పరీక్షలు చేయించిన తర్వాత, దోషులని తేలితే వారిని శిక్షించాలనడం రాజకీయంగా దుమారం రేపిం ది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ, బీఎస్పీ నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. రేపిస్ట్‌లకు మద్దతు పలికేలా అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడుతున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ.. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది నిందితులకు డీఎన్‌ఏ పరీక్షలు చేయించారని ప్రశ్నించారు.