calender_icon.png 12 January, 2025 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రఫ్ఫాట

22-07-2024 12:05:00 AM

  • టీమిండియా రికార్డు స్కోరు
  • రిచా ఘోష్, హర్మన్ మెరుపులు

యూఏఈపై విజయం

బౌలర్లపై పగబట్టినట్లు.. బంతితో ఆజన్మశత్రుత్వం ఉన్నట్లు.. మన అమ్మాయిలు దంచికొట్టడంతో.. మహిళల ఆసియా కప్‌లో టీమిండియా వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. తొలి పోరులో పాకిస్థాన్ బౌలర్లను తుక్కుకింద కొట్టిన హర్మన్‌ప్రీత్ బృందం.. రెండో మ్యాచ్‌లో యూఏఈ బౌలింగ్ లైనప్‌ను తుత్తునియాలు చేసింది. ఫలితంగా పొట్టి ఫార్మాట్‌లో తమ అత్యధిక స్కోరు నమోదు చేసుకున్నభారత్.. ఆనక బౌలింగ్‌లోనూ రాణించి సెమీస్‌కు చేరువైంది. 

దంబుల్లా: మహిళల ఆసియాకప్‌లో భారత జట్టు జోరు కొనసాగు తోంది. మొదటి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను చిత్తుచేసిన టీమిండియా.. మలి పోరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని మట్టికరిపించి అనధికారికంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బ్యాటర్లు దుమ్మురేపడంతో హర్మన్‌ప్రీత్ బృందం.. పొట్టి ఫార్మాట్‌లో తమ అత్యుత్తమ స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసింది.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (47 బంతుల్లో 66; 7 ఫోర్లు, 1 సిక్సర్) బాధ్యతాయుత అర్ధశతకంతో రాణించగా.. వికెట్ కీపర్ రిచా ఘోష్ (29 బంతుల్లో 64 నాటౌట్; 12 ఫోర్లు, ఒక సిక్సర్) ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఇన్నింగ్స్ చివరి ఐదు బంతులను బౌండ్రీకి పంపిన రిచా ఘోష్ 26 బంతుల్లో టీ20ల్లో తొలి అర్ధశతకం తన పేరిట లిఖించుకుంది. యువ ఓపెనర్ షఫాలీ వర్మ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, ఒక సిక్సర్) కూడా దుమ్మురేపింది. ఫలితంగా భారత మహిళల జట్టు టీ20ల్లో తొలిసారి రెండొందల మార్కు దాటింది. అనంతరం లక్ష్యఛేదనలో యూఏఈ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది.

కెప్టెన్ ఇషా ఓజా (38), కవిషా (40 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. మన బౌలర్లలో దీప్తి శర్మ 2, రేణుక, తనూజ, పూజ, రాధ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. గాయం కారణంగా యువ స్పిన్నర్ శ్రెయాంక పాటిల్ ఆసియాకప్‌నకు దూరం కావడంతో ఆమె స్థానంలో తనుజా కన్వర్‌కు జట్టులో చోటు దక్కింది. మెరుపు అర్ధశతకంతో రాణించిన రిచా ఘోష్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకుంది. గ్రూప్ భాగంగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్ 4 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక చివరి లీగ్ మ్యాచ్‌లో మంగళవారం నేపాల్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.