calender_icon.png 23 January, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో కేసులో రాధాకిషన్‌రావు అరెస్ట్

05-07-2024 12:43:27 AM

క్రియా సంస్థ డైరెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి షేర్ల బదలాయింపు

సంస్థ డైరెక్టర్ వేణుమాధవ్ ఫిర్యాదుతో పోలీసుల చర్య

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సంచనలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయనను పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. వివరా ల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన చెన్నుపాటి వేణుమాధవ్ విదేశాల్లో చదువు పూర్తి చేసి భారత్‌కు తిరిగి వచ్చి 2011లో క్రియా హెల్త్ కేర్ సంస్థను ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలోని పలు జిల్లా ల్లో వీరి సంస్థ సేవలను విస్తరించి సుమారు రూ.250 కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టింది.

ఈ సంస్థలో ఇద్దరు శాశ్వత డైరెక్టర్లు వేణు, బాలాజీ, నలుగురు తాత్కాలిక డైరెక్టర్లుగా గోపాల్, రాజ్, నవీన్, రవి ఉన్నారు. సంస్థకు సీఈవోగా బాలాజీ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో 2016 నాటికి సంస్థలో వేణు 60 శాతం, బాలాజీ 20 శాతం, గోపాల్ 10 శాతం, రాజ్ 10 శాతం చొప్పున వాటాలతో షేర్ హోల్డర్లుగా ఉన్నారు. 2018లో నలుగురు తాత్కాలిక డైరెక్టర్లు కలిసి వేణు పేరిట ఉన్న 60 శాతం షేర్లను తక్కువ ధరకు విక్రయించాలని, సంస్థను పూర్తిగా తామే నడిపించుకుంటామని ఒత్తిడి తెచ్చారు. ఇదే సమయంలో గోల్డ్ షిప్ అబోడే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈవో చంద్రశేఖర్ వేగే పరిచయమవ్వగా, తాత్కాలిక షేర్లు విక్రయించాలంటూ ఒత్తిడి తెస్తున్న విషయాన్ని వేణు అతనితో ప్రస్తావించాడు.

క్రియా సంస్థలో తాను షేర్ హోల్డర్‌గా మారితే నలుగురు తాత్కాలిక డైరక్టర్లతో బేరసారాలు నడిపేందుకు అవకాశం ఉంటుందని వేణుకు చంద్రశేఖర్ చెప్పాడు. ఇందుకు అంగీకరించిన వేణుమాధవ్ మొత్తం రూ.40 కోట్ల విలువ చేసే రూ.4 లక్షల షేర్లను చంద్రశేఖర్ వేగే పేరిట బదిలీ చేశాడు. ఆ తర్వాత చంద్రశేఖర్ ప్లేట్ ఫిరాయించి తాత్కాలిక డైరెక్టర్లతోనూ ఇదే తరహాలో ఒప్పందం చేసుకున్నట్లు ఫిర్యాదులో వేణుమాధవ్ పేర్కొన్నారు.

ఈ తరుణంలో రాధాకిషన్‌రావు.. చంద్రశేఖర్‌కు మద్దతుగా నిలిచి తన కోట్ల విలువైన షేర్లను నలుగురు డైరెక్టర్ల పేరిట బలవంతంగా బదిలీ చేయించారని ఆ సంస్థ వ్యవస్థాపకుడు వేణుమాధవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసు నమోదు చేశారు. రాధాకిషన్‌తో పాటు మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సహా చంద్రశేఖర్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీలపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు కొందరు నిందితులను అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న నిందితుల కోసం లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.