calender_icon.png 16 November, 2024 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాడార్ రగడ

26-09-2024 01:41:39 AM

  1. నేవీకి దామగుండం అటవీస్థలం అప్పగింతపై అభ్యంతరాలు
  2. ప్రతిపాదనను పట్టించుకోని గత సర్కార్..   ప్రస్తుత ప్రభుత్వంలో మళ్లీ తెర పైకి
  3. జీవవైవిధ్యంతో పాటు పర్యావరణానికి  ముప్పు అంటున్న పర్యావరణ ప్రేమికులు

వికారాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ రగడ రోజురోజుకు ముదురుతున్నది. రాడార్ ఏర్పాటును గత ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. నేవీకి భూమి బదలాయింపును సైతం చేయలేదు. దీంతో నేవి రాడార్ ప్రతిపాదన ఆగింది. పది నెలల క్రితం రాష్ట్రంలో  కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

దీంతో రాడార్ ఏర్పాటు మళ్లీ తెరమీదకు వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రాడార్ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తున్నారని తెలిసింది. రాడార్ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తుండగా, దామగుండం పరిరక్షణ సమితి సభ్యులు, పర్యావరణ ప్రియులు మాత్రం పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ససేమిరా అంటున్నారు.

దీనిలో భాగంగానే నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించారు. దీనిని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని విమర్శలు ఉన్నా యి. పర్యావరణానికి ఎలాంటి ముప్పు కలుగకుండా చూసుకుంటూ, కోర్టు ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తామనే ధోరణిలో సర్కార్ ఉన్నట్లు తెలిసింది.  

అభ్యంతరాలు ఇలా..

అటవీప్రాంతంలో రాడార్ ఏర్పాటు చేయొద్దని దామగుండం పారెస్ట్ ప్రొటెక్షన్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఇక్కడ నేవీ రాడర్ ఏర్పాటు చేస్తే చుట్టూ 25 కిమీ మేర రేడియేషన్ ఏర్పడుతుందని, సుమారు 12 లక్షల చెట్లు కూల్చివేయాల్సిన పరిస్థితి వస్తుందని పిటిషనర్ వాదిస్తున్నారు. ఓ పురాతన దేవాలయం కనమరుగు కావడంతో పాటు జీవవైవిధ్యం దెబ్బతింటుందం టున్నారు.

వీటిని పరిగణలోకి తీసుకుని కోర్టు నేవీకి కొన్ని మార్గదర్శకాలు చేసింది. ఆలయానికి వచ్చే భక్తులను అనుమతించే విషయంలో ఎలాంటి  ఇబ్బంది పెట్టొద్దని సూచించింది.

మరోవైపు ఇక్కడ నేవీ రాడార్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, టౌన్‌షిప్ వస్తుందని, తద్వారా మంచి స్కూళ్లు, హాస్పిటల్స్, బ్యాంకులు, మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని, నేవీ అధికారులు కొత్తగా ప్లాంటేషన్ చేస్తారని ప్రభుత్వ ప్రతినిధులు స్థానికులకు చెప్తున్నట్లు సమాచారం.

ప్రాజెక్టు లో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ 27 కిమీ మేర రోడ్డు వస్తుందని, అన్ని అనుకున్నట్లు జరిగితే 2027లోపు రాడార్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని నేవీ భావిస్తున్నది.

నేపథ్యం ఇదీ..

నౌకలు, జలాంతర్గాముల్లోని సైనికులతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్‌ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్‌ను ఉపయోగిస్తుంది. భారత నావికా దళం తెలంగాణలో రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు పూడూరు మండలంలోని దామచర్లను కీలక స్థావరంగా ఎంచుకున్నది. 1,174 ఎకరాల అటవీ ప్రాంతంలో దేశంలోనే రెండో వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్‌ఎఫ్) కమ్యూనికేషన్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ ప్రతిపాదనను 2010లో విశాఖ తూర్పు నావికా దళం యూపీఏ ప్రభుత్వం ముందు ఉంచింది. దీనికి 2014లో ఆమోదం లభించింది. ఇదే ఏడాది కేంద్ర ఆటవీ, పర్యావరణశాఖ సైతం ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అటవీశాఖ భూమికి రూ.133.54 కోట్లు కాంపా నిధులు, భూసంరక్షణ మరో పనులకు రూ.18.56 కోట్లు నేవీ చెల్లించింది.