calender_icon.png 7 November, 2024 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాచపుండు విశ్వరూపం

18-04-2024 12:05:00 AM

ఈ ఆధునిక కాలంలో ‘మనిషికి మరణం అంటూ సంభవిస్తే ఇక అది క్యాన్సర్ (రాచపుండు) భూతం వల్లే’ అన్న అభిప్రాయం రానురాను బలపడుతున్నది. కారణం, క్యాన్సర్ విశ్వరూపం, చికిత్సా విధానాలు వైద్య నిపుణుల అంచనాలకు పూర్తిగా అందకుండా వుండటమే. 

ఈ తరుణంలోనే మన దేశంలోని ప్రసిద్ధ ప్రైవేట్ హాస్పిటల్స్ గ్రూప్ ‘అపోలో’ జాతీయ స్థాయిలో ఒక ఆసక్తికరమైన అధ్యయనం నిర్వహించి, ఆశ్చర్యకరమైన, ఆలోచింపదగ్గ ఫలితాన్ని వెల్లడించింది. అదేమిటంటే, యావత్ ప్రపం చంలోనే ‘భారతదేశం రాచపుండుకు రాజధాని’గా అవతరించడం. ఇందులోని నిజానిజాలు, విశ్వసనీయత ఎలా వున్నా, ఆ నివేదికలోని అంశా లు మాత్రం అందరం గమనించదగ్గవి. ఈ నేపథ్యంలోనైనా క్యాన్సర్ మహమ్మారిపై ‘మూడో ప్రపంచ యుద్ధాని’కి తక్షణం తెరతీయవలసిన అవసరాన్ని అందరం గుర్తించగలిగితే మంచిది. క్యాన్సర్ సోకని శరీర భాగం ఉండదు. దీని పెరుగుదల అసాధారణం. ప్రపంచ వ్యాప్తంగానే అత్యధిక ప్రజల మరణానికి దారితీస్తున్న రెండో అతిపెద్ద మహమ్మారిగా క్యాన్సర్‌ను ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ ఇప్పటికే ప్రకటించింది. 

నైతిక బాధ్యతతోనే నివేదిక

మానవాభివృద్ధిలో ప్రత్యేకించి ‘విద్య రంగాలకు వున్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి విద్య విషయం అలా వుంచి, ప్రపంచవ్యాప్తంగా వైద్యారోగ్య రంగం అంతర్జాతీయ స్థాయిలో సాధించిన సాంకేతిక ప్రగతి అంతా ఇంతా కాదు. పేదఛీ ప్రజల స్థితిగతులకు అతీతంగా, ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యస్పృహ ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. పుట్టిన అందరూ విధిగా మరణానికి దూరం కావాలనే ఆశిస్తారు. కానీ, అది సాధ్యం కాదనీ తెలుసు. అందుకేనేమో, ప్రకృతి క్యాన్సర్ భూతాన్ని పుట్టించి వుంటుంది. అసలు, ‘క్యాన్సర్ వ్యాధి అన్నది నిజమా? లేక, వైద్య మాఫియా కృత్రిమ సృష్టినా’ అన్న చర్చను పక్కన పెట్టి, ఒక రకమైన నైతిక బాధ్యతతోనే ఇటీవలి ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ (ఏప్రిల్ 7) సందర్భంగా ‘అపోలో’ హాస్పిటల్స్ ‘జాతీయ ఆరోగ్య నివేదిక’ విడుదలను అర్థం చేసుకోవాలి.

అయిదేళ్లలో ౧౩ శాతం పెరుగుదల

కారణాలు, పరిస్థితులు ఏవైనప్పటికినీ భారతీయ ప్రజలలో ఈమధ్య కాలంలో క్యాన్సర్ మహావ్యాధి పెద్ద ఎత్తున విస్తరిస్తున్నట్టు ‘అపోలో’ హాస్పిటల్స్ నివేదిక వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం, మన దేశ దుస్థితి ఎక్కడిదాకా వచ్చిందంటే, ఏకంగా ‘ప్రపంచంలోనే భారతదేశం క్యాన్సర్‌కు కొత్త రాజధాని’గా మారడం. ఒక అంచనా ప్రకారం వచ్చే ఏడాది (2025)కల్లా దేశంలో క్యాన్సర్ వ్యాధి పీడితుల సంఖ్య 15 లక్షలకు చేరుకుంటుంది. అంటే, 2020లోని 13 లక్షల పేషెంట్లతో పోల్చితే ఇది అయిదేళ్లలో 13 శాతం పెరుగుదలగా చెబుతున్నారు. ఆలోచింపదగ్గ మరో విషయం కూడా నివేదికలో లేకపోలేదు. ‘వయసు కాని వయసు వారికి’ లేదా ‘అనేకులకు చిన్నవయసులోనే’ ఇది సోకుతుండటం ఆందోళన కలిగించే అంశం.

క్యాన్సర్ బారిన పడుతున్న వారి సగటు వయసు ప్రపంచదేశాలతో పోల్చినప్పుడు మన దేశంలోనే అత్యంత ‘పిన్న వయస్కులు’ ఉంటున్నట్టు ‘అపోలో’ నివేదిక వెల్లడించింది. “అమెరికా, యూరొప్‌లలో రొమ్ము క్యాన్సర్ వ్యాధి నిర్ధారితుల సగటు వయసు 63 ఏళ్లుంటుండగా, మన దేశంలో మాత్రం 52గానే ఉంది. శ్వాసకోశాల క్యాన్సర్ నిర్ధారితుల సగటు వయసు పాశ్చాత్య దేశాల్లో 70 ఏళ్లు ఉంటుంటే, భారత్‌లో 59 ఏళ్లుగానే నమోదైంది.” ఇంతేకాదు, మన దేశంలో 30 శాతం పెద్ద ప్రేగు క్యాన్సర్ బాధితుల వయసు 50 సంవత్సరాల లోపే వుంది. పై నివేదికలోని చివరి అంశం మరింత గమనించదగ్గది.  

ఇకనైనా అవగాహన పెరగాలి!

క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ సైతం మన దేశంలో అత్యల్ప స్థాయిలో జరుగుతున్నట్లు పై నివేదిక వెల్లడించింది. రొమ్ము క్యాన్సర్ నిర్ధారణలు (స్క్రీనింగ్) అమెరికాలో 82 శాతం, బ్రిటన్‌లో 70 శాతం, చైనాలో 23 శాతం మేర జరుగుతుండగా, ఇండియాలో 1.9 శాతమే. ఇక, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ అయితే అమెరికా (73 శాతం), బ్రిటన్ (70 శాతం), చైనా (43 శాతం)లకన్నా మన దేశంలోనే అత్యంత అల్ప స్థాయి (0.9 శాతమే)లోనే జరుగుతున్నట్టు నివేదిక నిర్ధారించింది. “ఈ జాతీయ నివేదిక ఫలితాలు భారతదేశ ప్రజలలో రానున్న కాలంలో క్యాన్సర్ వ్యాధి చికిత్స, నిర్ధారణలతోపాటు రక్తపోటు, ఊబకాయం వంటి తీవ్రస్థాయి ఆరోగ్యాంశాలపట్ల పెంచుకోవలసిన అవగాహనను తెలియజేస్తున్నట్టు ‘అపోలో’ హాస్పిటల్స్ గ్రూప్ వైస్ ఛైర్‌పర్సన్ డా॥ ప్రీతారెడ్డి అభిప్రాయపడ్డారు.

దోర్బల బాలశేఖరశర్మ