calender_icon.png 2 January, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సంవత్సర వేడుకలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

30-12-2024 07:06:50 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): డిసెంబర్ 31, 2024న జరగనున్న నూతన సంవత్సర వేడుకల(New Year Celebrations) కోసం రాచకొండ ట్రాఫిక్ పోలీసులు(Rachakonda Traffic Police) ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు, భద్రతా చర్యలను జారీ చేశారు. నాగోల్ ఫ్లైఓవర్, కామినేని ఫ్లైఓవర్, ఎల్‌బి నగర్ ఎక్స్ రోడ్ మల్టీ లెవల్ ఫ్లైఓవర్‌లు, బైరమల్‌గూడ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్‌లతో సహా కీలకమైన ఫ్లై ఓవర్‌లు మంగళవారం రాత్రి 10:00 గంటల నుండి 5 గంటల వరకు ఎల్‌ఎమ్‌విలు, ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాల కోసం మూసివేయబడతాయని పేర్కొన్నారు. జనవరి 1, 2025న ఉదయం 5:00 కు భారీ వాహనాలు ఈ సమయంలో గూడ్స్ వాహనాలు అనుమతించబడతాయని చెప్పారు. క్యాబ్‌లు, టాక్సీలు, ఆటో రిక్షాలు డ్రైవర్లు సరైన యూనిఫాంలో ఉండాలని, అవసరమైన అన్ని పత్రాలను కలిగి ఉండేలా చూసుకోవాలని సూచించారు.

రైడ్‌ను అందించడానికి నిరాకరిస్తే మోటారు వాహనాల చట్టం(Motor Vehicles Act) 1988లోని సెక్షన్ 178 ప్రకారం రూ.500 జరిమానా విధించబడుతుందన్నారు. రైడ్‌ను నిరాకరిస్తే వాహనం నెంబర్, సమయం, స్థలం వివరాలతో ఫిర్యాదులను వాట్సాప్ నంబర్ 8712662111కు పంపవచ్చని వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పత్రాలు లేని వాహనాలను తాత్కాలికంగా సీజ్ చేస్తారు. డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ అధికారులకు కట్టుబడి, అవసరమైన పత్రాలను సమర్పించాలి. మైనర్లు, లైసెన్స్ లేని వారు, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం రాత్రి 11.00 గంటల తరువాత డ్రంక్ డ్రైవింగ్ కింద పట్టుబడుతే మోటారు వాహనాల చట్టం, 1988 సెక్షన్ 185 కింద కేసులు బుక్ చేయబడతాయన్నారు.

నేరస్థులకు జరిమానాలు మొదటి నేరానికి 10,000 లేదా 6 నెలల వరకు జైలు శిక్ష, తదుపరి నేరాలకు రూ.15,000 లేదా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, నేరస్థుడి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడమే లేదా రద్దు చేయబడుతుందని సూచించారు. తద్వారా వారు భారతదేశంలో డ్రైవింగ్ చేయడానికి అనర్హులుగా చేస్తారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల ప్రాణాపాయకరమైన ప్రమాదం జరిగితే భారతీయ న్యాయ సంహిత(Indian Penal Code)లోని సెక్షన్ 105 కింద క్రిమినల్ కేసు నమోదు చేయబడుతుందని, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించబడుతుందని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.  ఔటర్ రింగ్ రోడ్(Outer Ring Road)పై తేలికపాటి మోటార్ వాహనాలు (LMVలు) ప్యాసింజర్ వాహనాలు నడిపేందుకు డిసెంబర్ 31, 2024 రాత్రి 11:00 నుండి జనవరి 1, 2025 ఉదయం 5:00 వరకు రోడ్డులు అన్ని మూసివేయబడతాయని పేర్కొన్నారు. తేలికపాటి మోటారు వాహనాలపై విమానాశ్రయానికి ప్రయాణించే ప్రయాణీకులు విమాన టిక్కెట్లను చూపితే ఔటర్ రింగ్ రోడ్డులో అనుమతించబడతారని తెలిపారు.