- టెక్నాలజీ వాడకంతో తగ్గిన నేరాలు
- గతేడాదితో పోలిస్తే కేవలం 4 శాతం పెరుగుదల
- డయల్ 100 ద్వారా 2,41,742 ఫిర్యాదులు
- త్వరలో నూతన పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు
- రాచకొండ కమిషనరేట్ 2023-24 వార్షిక నివేదికను విడుదల చేసిన సీపీ జీ సుధీర్‌బాబు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (విజయక్రాంతి) : రాచకొండ కమిషనరేట్ పరిధిలో అమలు చేస్తున్న ‘విజిబుల్ పోలిసింగ్, క్విక్ రెస్పాన్స్, టెక్నాలజీ’ (వీక్యూటీ)తో నేరాల సంఖ్య అదుపులో ఉందని పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు అన్నారు. కమిషనరేట్ పరిధిలో సుమారు 62 లక్షల ప్రజలు నివసిస్తున్నారు. వారి భద్రత కోసం విక్యూటీ అమలు చేశాం.
ఇందులో విజిబుల్ పోలిసింగ్ అంటే.. నిరంతర గస్తీ, సైకిల్ పెట్రోలింగ్, సాయంత్రం వేళల్లో ప్రజల చెంతకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం వంటివి. క్విక్ రెస్పాన్స్ అంటే.. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించడం వంటివి. టెక్నాలజీ అంటే.. కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెక్నికల్ బృందాలు సీసీ ఫుటేజీలను విశ్లేషించడం, కాల్ డేటా, ఐపీ అడ్రస్ వంటి టెక్నాలజీ సంబంధిత విషయాలను త్వరిగతినా తెలుసుకోవడం వంటివి.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే కేవలం 4 శాతం మాత్రమే క్రైమ్ రేట్ పెరిగిందని అన్నారు. ఈ ఏడాది మొత్తం 33,084 కేసులు నమోదయ్యాయని చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నమోదైన కేసుల వివరాలతో సీపీ జి.సుధీర్‌బాబు వార్షిక నివేదిక 2023 విడుదల చేశారు.
సోమవారం నాగోల్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీపీలతో కలిసి ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది నమోదైన 33,084 కేసుల్లో 25,143 కేసులు పరిష్కరించామని అన్నారు. నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు 8*8*8 విధానంతో మూడు షిఫ్టుల్లో పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాం.
ఈ ఏడాది రాష్ట్రంలో అత్యధిక కేసులను పరిష్కరించిన కమిషనరేట్‌గా రాచకొండ నిలిచింది. మా పరిధిలో నమోదైన కేసుల్లో 30 మందికి జీవిత ఖైదు శిక్ష పడింది. అందులోనూ అగ్రస్థానంలో నిలిచాం. సంచలనం సృష్టించిన మోటకొండూరు పీఎస్ పరిధిలో 14 మంది నిందితులకు జీవిత ఖైదు పడింది. వివిధ కేసుల్లో 160 మందికి శిక్ష ఖరారైందని సీపీ పేర్కొన్నారు.
డయల్ 100 ద్వారా2,41,742 ఫిర్యాదులు
లోక్ అదాలత్‌లో 11,440 కేసులతో పాటు 70,791 పెట్టీ కేసులు పరిష్కారమయ్యాయి. ఈ ఏడాది డయల్ 100 ద్వారా 2,41,742 ఫిర్యాదులు వచ్చాయి. అన్ని విభాగాల్లో కలిపితే క్రైమ్ రేట్ 4 శాతం మాత్రమే పెరిగింది. గతేడాదితో పోలిస్తే హత్య కేసుల్లో ఎలాంటి మార్పు లేదు. చోరీ కేసులు 6 శాతం, గృహహింస నేరాలు 23 శాతం తగ్గాయి. రూ. 88.25 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశాం.
మొత్తం 253 డ్రగ్ కేసులు నమోదు కాగా, 521 మంది నేరస్థులను అ రెస్ట్ చేశాం.ఆ నిందితులపై 165 రౌడీషీట్లు ఓపెన్ చేశాం. కమిషనరేట్ పరిధిలో ఇల్లీగల్ దందాలు నిర్వహిస్తున్న 23 వ్యాపారాలను మూసివేశాం. ఎన్నికల సందర్భంగా రూ. 16 కోట్ల నగదు, మద్యం సీజ్ చేశాం. గతేడాది 2562 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 4458 కేసులు నమోదయ్యాయి.
వీటిల్లో 53 నిందితులను అరెస్ట్ చేసి బాధితులకు రూ. 22 కోట్లు రిఫండ్ అయ్యేలా చర్యలు చేపట్టాం. కమిషనరేట్ పరిధిలో 2023లో 3657 రో డ్డు ప్రమాదాల కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 3207 మాత్రమే నమోదయ్యాయి. గతంతో పోలిస్తే 12 శాతం వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గాయి.
నూతన పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు..
రాచకొండ కమిషనరేట్ పరిధిలో రాబోయే సంవత్సం నూతన పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు సీపీ తెలిపారు. వీటితో పాటు నూతన డివిజన్లను ఏర్పాటు చేస్తామన్నారు. కమిషనరేట్ పరిధిలో సుమారు 2.11 లక్షల సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయి. ప్రజలను అప్రమత్తం చేసేందుకు వినియోగిస్తున్న సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ను 2.50 లక్షల మంది ఫాలో చేస్తున్నారని తెలిపారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు 5 మంది ఏఆర్ కానిస్టేబుళ్లను కేటాయించి వారికి టెక్నికల్ సంబంధిత శిక్షణను ఇస్తామన్నారు. 2025 సంవత్సరం మరింత ప్రణాళికబద్దంగా ముందుకెళ్తామని పేర్కొన్నారు.
మోహన్‌బాబుకు నోటీసులు ఇస్తాం..
కమిషనరేట్ పరిధిలో హద్దు దాటే బౌన్సర్లపై తీవ్ర చర్యలు ఉంటాయి. భయానక వాతావరణాన్ని సృష్టించడంతో పాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేసి దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయి. సినీ నటుడు మోహన్‌బాబు కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇది కోర్టు పరిధిలో ఉంది. హైకోర్టు ఆయనకు ఈ నెల 24 వరకు గడువు ఇచ్చింది.
ఆ తర్వాత నోటీసులు ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు. రాబోయే నూతన సంవత్సర వేడుకలను జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించారు. మద్యం తాగి రోడ్లపై హంగా మా సృష్టించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకు మాత్రమే పర్మిషన్ ఉందని మరోసారి స్పష్టం చేశారు.