calender_icon.png 3 April, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్‌లను ఆమోదించే బాధ్యత ఆర్.కృష్ణయ్యదే

26-03-2025 12:36:35 AM

పలు బీసీ విద్యార్థి, యువజన, సంక్షేమ సంఘం నాయకుల డిమాండ్

ముషీరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి) : 42 శాతం బీసీ రిజర్వేషన్లు పార్లమెంట్ లో ఆమోదించే బాధ్యత బీసీ నేత, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య తీసుకోవాలని, లేదంటే బిజెపికి రాజీనామ చేయాలని పలు బీసీ విద్యార్థి, యువజన, సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

ఈ మేరకు మంగళవారం బషీర్బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా  సమావేశంలో బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కుర్మా, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ తదితరులు మాట్లాడుతూ ఆర్. కృష్ణయ్య చేస్తున్న బీసీ ఉద్యమ ద్రోహంపై త్వరలోనే బీసీ దర్బార్ ఏర్పాటు చేసి ఆయన చిట్టా విప్పుతామని హెచ్చరించారు.

బీసీ వాదంతో పోరాడుతున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పై ఆర్.కృష్ణయ్య తన అనుచరులను ఉసిగొలిపి అసభ్య పదజాలంతో వ్యక్తిగతంగా దూషిస్తూ రాళ్లతో కొట్టి చంపుతాం, మాపియాలతో చంపిస్తాం అంటూ బహిరంగంగా మాట్లాడటం సిగ్గు చేటని అన్నారు.

త్వరలోనే హైదరాబాద్‌లో రాష్ట్రంలో ఉన్న బీసీ మేధావులు, కుల సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళ సబ్బండ కులాలతో కలిసి బీసీ దర్బార్ ఏర్పాటు చేసి ఆర్.కృష్ణయ్య చీకటి మాఫియా రాజకీయాలను, తన పుట్టిన ఊరిలో చేస్తున్న భూదందాలను, రాజకీయ అవసరాల కోసం రంగులు మారుస్తున్న ఆయన నైజాన్ని(పిపిటి) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమాజానికి వివరిస్తామని వారు హెచ్చరించారు.