calender_icon.png 23 December, 2024 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాలో కోటా ఆందోళన

20-07-2024 12:00:00 AM

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకంగా విద్యార్థులు గత కొద్ది రోజులుగా చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇప్పుడు దేశం యావత్తు ఈ గొడవలతో అట్టుడికి పోతున్నది. గురువారం ఆందోళనకారులు చేపట్టిన దేశవ్యాప్త బంద్ హింసాత్మకమైంది. దేశ రాజధాని ఢాకాతోపాటు పలు నగరాల్లో  పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 18 మంది చనిపోగా, వందలాది మంది గాయపడ్డారు. దీంతో ఇప్పటిదాకా మృతి చెందిన వారి సంఖ్య 50 కి చేరింది. దాదాపు 2,500 మంది గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువమంది విద్యార్థులే ఉండగా, కొందరు జర్నలిస్టులూ గాయపడినట్లు  తెలుస్తున్నది. అయితే, పూర్తి వివరాలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

మరోవైపు దేశవ్యాప్త బంద్‌తో ప్రజాజీవితం స్తంభించింది. వాణిజ్యసంస్థలు, దుకాణాలు, మార్కెట్లు, రవాణా వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు ఇళ్లలోంచి బయటికి రాలేకపోయారు. ఢాకాలోని రాంపుర ప్రాంతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ టెలివిజన్ భవనానికి ఆందోళనకారులు చుట్టుముట్టి అక్కడ పార్క్ చేసిన పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా సైన్యాన్ని, పారామిలిటరీ బలగాలను మోహరించింది. మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. వారు ఎప్పుడంటే అప్పుడే చర్చలకు సిద్ధంగా ఉన్నామని న్యాయశాఖ మంత్రి అనిసుల్ చేసిన ప్రతిపాదనను విద్యార్థి సంఘాలు తిరస్కరించాయి.

బంగ్లాదేశ్‌లో హింస నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అక్కడి విద్యార్థులకు భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ కూడా జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో 8 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడోవంతు 1971 నాటి బంగ్ల్లాదేశ్ విముక్తి పోరాటంలో పాల్గొన్న మాజీ సైనికుల బంధువులు, కుటుంబసభ్యులకు ఇచ్చేలా ఉన్న ప్రస్తుత రిజర్వేషన్ విధానాన్ని సంస్కరించి, ప్రతిభ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కోటాతోసహా వెనుకబడిన జిల్లాలకు, ఇతర వర్గాలకు ఉన్న రిజర్వేషన్లు కలిస్తే 50 శాతానికి పైగా ఉద్యోగాలు ఆ వర్గాలకే దక్కుతున్నాయి. 

ఈ రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేయడానికి ప్రధాని షేక్ హసీనా గతంలో నిర్ణయం తీసుకోగా, హైకోర్టు ఇటీవల దాన్ని కొట్టి వేసి, రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ తీర్పు చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లగా సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించి తదుపరి విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా ఓపిక పట్టాలని, విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ప్రధాని హసీనా విజ్ఞప్తి చేశారు కూడా. ఈనెల మొదట్లో ప్రారంభమైన ఈ ఆందోళనలు శాంతియుతంగానే కొనసాగినా అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన బంగ్లాదేశ్ ఛాత్ర లీగ్ పోటీ ఆందోళనలు చేపట్టడంతో హింస మొదలైంది. గురువారం బంద్ నేపథ్యంలో ఢాకాలో మెట్రో రైలు సేవలతోపాటు వివిధ ప్రాంతాలనుంచి రైలు సర్వీసులు కూడా నిలిచిపోయాయి.

విద్యార్థులు పరస్పరం సంప్రదించుకోకుండా 4-జీ మొబైల్ సేవలను సైతం నిలిపివేశారు. విద్యార్థుల ఆందోళన న్యాయమైందే. ప్రభుత్వ ఉద్యోగాల్లో సగానికి పైగా రిజర్వేషన్ల పేరుతో ఇతరులకు కట్టబెడితే ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి, చదువులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూసే తమకు అన్యాయం జరుగుతుందనేది వారి ఆందోళన. అందుకే, వారు మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా కోటా విధానాన్ని సంస్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, వాస్తవానికి మాజీ సైనికుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లు ఉన్నా 10 శాతమే అమలవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, ఆర్థిక సమస్యలూ ఈ ఆందోళనలకు కారణమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రతిభకు పట్టం కట్టకపోతే వ్యవస్థలు నిర్వీర్యమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలకులు ఈ విషయంలో విజ్ఞత చూపాల్సిన అవసరం ఉంది.