calender_icon.png 24 April, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసమస్యలకు సత్వర పరిష్కారం

24-04-2025 05:45:47 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు విస్తృతంగా కొనసాగుతున్నాయి. గురువారం నర్సాపూర్. జి మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజలకు భూభారతి చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజల భూ సమస్యలు సులువుగా పరిష్కరించేందుకు వీలుగా నూతన భూభారతి చట్టం రూపొందించబడిందని తెలిపారు.

గ్రామాల్లో గ్రామ పాలన అధికారులను నియమించడం ద్వారా, ప్రజల భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. ఎంతోమంది అనుభవజ్ఞులైన అధికారులు, భూ చట్టాల నిపుణులు, న్యాయ నిపుణులు రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను తెలుసుకొని, ఎన్నో రాష్ట్రాల భూ చట్టాలను పరిశీలించిన తర్వాత సమగ్ర భూభారతి చట్టాన్ని రూపొందించారని తెలిపారు. నూతన భారతి చట్టం అమలుతో తహసీల్దార్ స్థాయిలోనే ఎన్నో భూ సమస్యలు పరిష్కారం అవుతాయి అని అన్నారు. అన్ని భూ సమస్యల దరఖాస్తుల పరిష్కారానికి నిర్ణీత గడువును విధించారని తెలిపారు. సాదా బైనామా ప్రక్రియ తిరిగి వినియోగంలోకి రాబోతుందని అన్నారు.

భవిష్యత్తులో ఎటువంటి భూ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకై రైతుల పట్టాదారు పాసుపుస్తకం లో వారి భూములకు సంబంధించి వివరాలను మ్యాపింగ్ రూపంలో పొందుపరుస్తారన్నారు.  ఈ సమావేశంలో భాగంగా రైతుల ఎదుర్కొంటున్న పలు భూ సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టం ద్వారా అన్ని భూ సమస్యల పరిష్కారం లభిస్తుందని వారికి హామీ ఇచ్చారు. ఈ భూభారతి అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో పుష్పలత, మండల ప్రత్యేక అధికారి అంజి ప్రసాద్, రైతులు ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.