calender_icon.png 23 October, 2024 | 2:50 AM

రాష్ట్రానికి నేతల క్యూ

05-05-2024 12:08:15 AM

నేడు అమిత్ షా, రాహుల్ రాక

రేపు జేపీ నడ్డా.. 10న ప్రియాంక గాంధీ

ప్రచారంలో జాతీయ నేతల దూకుడు 

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల ప్రచార ముగింపునకు గడువు దగ్గరపడుతున్న కొద్ది అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల జాతీయ నేతలు రాష్ట్రంలో సుడిగాలి ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రధాని మోదీ రెండుసార్లు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం రాష్ట్రంలో రెండు రోజులపాటు ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ కూడా మరో సారి తెలంగాణకు ప్రచారం నిర్వహించేందుకు తరలివస్తున్నారు. నాలుగో ఫేజ్‌లో భాగంగా రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరుగుతుంది. ప్రచారానికి ఇక 6 రోజుల గడువు మాత్రమే ఉన్నది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. 

అమిత్ షా మూడు సభలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం రాష్ట్రంలో ఏకంగా మూడు సభల్లో పాల్గొననున్నారు ఆదిలాబాద్ అభ్యర్థి గొడం నగేష్‌కు మద్దతుగా మధ్యాహ్నం 1 గంటకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత నిజామాబాద్‌లో ధర్మపురి అర్వింద్ కోసం, సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా సభల్లో పాల్గొంటారు. సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం తెలంగాణ వస్తున్నారు. పెద్దపల్లి, భువనగిరి, నల్లగొండలో ఆయన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగిస్తారు. 

నిర్మల్, ఎర్రవల్లికి రాహుల్‌గాంధీ

ఆదివారం ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నిర్మల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగణకు మద్దతుగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నాగర్‌కర్నూల్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి చౌరస్తాలో ప్రచారంలో పాల్గొంటారు. ఆయన సోదరి ప్రియాంకగాంధీ ఈ నెల 6, 7 తేదీల్లో కామారెడ్డి, కూకట్‌పల్లిలో పర్యటించాల్సి ఉండగా 10వ తేదీకి వాయిదా పడింది. వేదికలు కూడా మారాయి. ఈ నెల 10వ తేదీన జహీరాబాద్  పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి, చేవెళ్ల పరిధిలోని తాండూరు, మహబూబ్ నగర్ పరిధిలోని షాద్‌నగర్‌లో ప్రియాంక ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.