calender_icon.png 21 September, 2024 | 6:02 AM

వివక్షను ప్రశ్నించండి

21-09-2024 03:01:07 AM

  1. వర్కింగ్ ఉమెన్స్‌ను వేధిస్తే సహించేది లేదు
  2. అవసరమైతే కొత్త చట్టాలు తెస్తాం
  3. సీఐఐ, ఐడబ్ల్యూఎన్ సదస్సులో మంత్రి సీతక్క

హైదరాబాద్, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): సమాజ సృష్టికి మూలమైన మహిళల పట్ల ఇంకా వివక్ష కొనసాగడం బాధాకరమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. వివక్ష కారణంగా మహిళలు ఇంకా వెనుకబడి ఉన్నారని చెప్పారు. ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తున్నా, పురుషులే గొప్ప అనే భావన సమాజంలో నాటుకపోయిందని పేర్కొన్నారు. తాము తక్కువ అనే ఆలోచన నుంచి మహిళలు బయటపడాలని పిలుపునిచ్చారు.

శుక్రవారం మాదాపూర్‌లోని టెక్ మహీంద్ర క్యాంపస్‌లో సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్‌వర్క్ (ఐడబ్ల్యూఎన్) తెలంగాణ 10వ వార్షిక లీడర్‌షిప్ సదస్సును ప్రారంభించిన అనంతరం మంత్రి సీతక్క మాట్లాడారు. ఎవరి మీద ఆధారపడకుండా కష్టాన్ని నమ్ముకున్న తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా రాష్ర్ట ప్రజలకు సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఒక ఆదివాసీ మహిళకు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వంటి పెద్ద శాఖను అప్పగిస్తే..13 వేల గ్రామపంచాయతీలు, రెండు కోట్ల మంది ప్రజలకు సేవ చేసే బాధ్యతను చాలెంజ్ గా స్వీకరించి పట్టుదలతో పనిచేస్తున్నట్లు చెప్పారు.

పని ప్రాంతాల్లో మహిళలకు భద్రత కల్పించాలని, ఆ దిశలో పరిశ్రమలు, ప్రభుత్వం కలిసి పని చేయాలని కోరారు. వర్క్‌ప్లేస్‌లో మహిళలకు భద్రత లేకపోతే ఇంకెక్కడ భద్రత ఉంటుందని ప్రశ్నించారు. మహిళలు తమ సమస్యలపై వెంటనే ప్రశ్నించడం నేర్చుకోవాలని సూచించారు. పని ప్రాంతాల్లో మహిళల మీద వేధింపులను సహించేది లేదని స్పష్టంచేశారు.

మన మూలాలను వెతుక్కుంటూ గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐడబ్ల్యూఎన్ తెలంగాణ చైర్‌పర్సన్ అనుపమ పండురు, సీఐఐ తెలంగాణ చైర్మన్ సాయి ప్రసాద్, యూఎస్ కాన్సులేట్ హైదరాబాద్ పబ్లిక్ డిప్లొమా ఆఫీసర్ ఏమిలియ స్మిత్, సీఐఐ మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.