calender_icon.png 9 October, 2024 | 4:21 AM

కమర్షియల్ ట్యాక్స్ గోల్‌మాల్‌పై ఆరా?

09-10-2024 02:48:02 AM

ఇష్టారాజ్యంగా కోట్ల ఖర్చుపై ప్రభుత్వం సీరియస్ 

అనుమతులు లేకుండానే ఛాంబర్‌కు మరమ్మతులు 

పనులు అవ్వకుండానే బిల్లులు విడుదల చేయించుకున్నట్టు ఆరోపణ

నిబంధనలకు విరుద్ధంగా ల్యాప్‌ట్యాప్‌ల కొనుగోళ్లు

జీఎస్టీ వెబ్‌సైట్ సాఫ్ట్‌వేర్ డీలింగ్‌లోనూ అవకతవకలు 

గత కమిషనర్ హయాంలో వృథా చేసినట్టు విమర్శలు

వాణిజ్య పన్నుల శాఖ ప్రస్తుత కమిషనర్ రిజ్వీ విచారణ?

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): గత పది నెలలుగా వాణిజ్య పన్నుల శాఖ నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈ శాఖను ఇప్పుడు నిధుల గోల్ మాల్ అంశం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక ఇబ్బం దులతో సతమతమవుతోంది.

ప్రతి రూపాయిని ఆదా చేసుకుంటూ సంక్షేమ పథ కాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తోంది. కానీ, వాణిజ్య శాఖలో ప్రభుత్వ స్ఫూర్తికి విరుద్ధంగా నిధులను దాదాపు రూ.4.50 కోట్లు ఇష్టానుసారంగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రాగా, అసలేమీ జరిగిందో నివేదిక ఇవ్వాలంటూ వాణిజ్య పన్నుల శాఖ కమిషర్ రిజ్వీని ఆదేశించినట్టు సమాచారం.

దీంతో కమిషనర్ ఈ విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. గత కమిషనర్ హయాంలోనే ఈ వృథా ఖర్చుల వ్యవహారం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. దీంతో గత కమిషనర్ హయాంలో అసలు ఏం జరిగింది? ఏయే పనులను చేపట్టారు? ఎన్ని నిధులు విడుదల అయ్యాయనే విషయాలపై కమిషర్ విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ఈ అంశంపై ఇప్పటికే ‘విజయక్రాంతి’ వరుస కథనాలు ప్రచురించింది. జూలై 9న ‘అంతా నా ఇష్టం’ శీర్షికతో, ఆగస్టు 6న  ‘అధికారులందున ఈ అనధికారుల కథే వేరు’ శీర్షికతో కథనాలు వెలువడ్డాయి. దీంతో ఉన్నతాధికారులు స్పందించి దర్యాప్తునకు ఆదేశించినట్టు సమాచారం. 

ఆర్‌అండ్‌బీ అంచనాలు లేకుండానే మరమ్మతులు

వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రిజ్వీకి ఆగస్టు 3న ప్రభుత్వం అదే శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయనకు ముందు ఉన్న కమిషనర్ పలు ఆరోపణలను ఎదుర్కొన్నారు. అవసరం లేకున్నా దాదాపు రూ.60 లక్షలతో ఖరీదైన కారును కొనుగోలు చేశారన్న విమర్శలు ఉన్నాయి.

అలాగే, బాధ్యతలు స్వీకరించిన వెంటనే పూర్వ కమిషనర్ తన ఛాంబర్‌కు దాదాపు రూ.2 కోట్లతో మరమ్మతులు చేపట్టారు. అసలే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు హడావుడిగా మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఏముందన్న విమర్శలు వచ్చాయి. 

వాటికి ఎలాంటి అనుమ తులు తీసుకోలేదని తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే, ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా అం చనాలను రూపొందించాల్సి ఉంటుంది. కానీ, నాటి కమిషనర్ ఇష్టానుసారంగా చాంబర్‌కు మరమ్మతులు మొద లు పెట్టినట్లు తెలుస్తోంది.

తన అనుయాయులకు ఆ కాంట్రా క్టు ఇచ్చినట్టు సమాచారం. 10 నెలల క్రితం మొదలు పెట్టిన పను ల్లో కనీసం 50 శాతం కూడా పూర్తికాలేదన్న విమర్శలు ఉన్నాయి. కానీ, రూ.2 కోట్లలో సగానికంటే ఎక్కువ నిధులను పూర్వ కమిషనర్ అండతో కాంట్రాక్టర్ మొదటి నెలలో విడుదల చేయించుకున్నట్టు తెలుస్తోంది. 

కార్యాలయ నిర్వహణ నిధుల దారి మళ్లింపు?

ఆఫీస్ నిర్వహణ నిమిత్తం గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం దాదాపు రూ.9 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది. వీటిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో స్టేషనరీ కోసం వినియోగించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిధులను పూర్వ కమిషనర్ దారిమళ్లించి చాంబర్ నిర్మాణం, ల్యాప్‌టాప్‌లు, లగ్జీరీ కారు కొనుగోలు చేసినట్లు సమాచారం.

అయితే, ఆఫీస్ నిర్వహణ కోసం కేటాయించిన బడ్జెట్‌లో తన విచక్షణాధికారాలను ఉపయోగించి కమిషనర్ రూ.5 లక్షలు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. కానీ, నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులను నీళ్లప్రాయంగా ఖర్చు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీనిపై ప్రస్తుత కమిషనర్ విచారణ చేపేడుతున్నట్టు తెలుస్తోంది. నిజంగా నాటి కమిషనర్ నిధులను దారి మళ్లించారా? ఇందులో అక్రమార్జన కోణం ఏమైనా ఉందా? నిబంధనలు ఉల్లంఘన జరిగిందా? లేకుండా ఇది బురదజల్లేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా? అనేది తెలియాలంటే.. విచారణ పూర్తయ్యేదాగా ఆగాల్సిందే.

అవసరం లేకున్నా ల్యాప్‌టాప్‌ల కొనుగోలు 

పూర్వ కమిషనర్ హయాంలో జరిగిన ల్యాప్‌టాప్‌ల కొనుగోలు వివాదాస్పదమైంది. అవసరం లేకు న్నా 200 ల్యాప్‌టాప్‌లను రూ.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్టు తెలిసింది. వాటిని జూనియర్, సీనియర్ అసిస్టెంట్లకు ఇచ్చి నట్టు సమాచారం. వాస్తవానికి వాణిజ్య పన్నుల శాఖలో అధికారులకు మాత్రమే ల్యాప్‌టాప్ సౌక ర్యం ఉంటుంది.

మిగతా వారికి ఉండదు. కానీ, గత కమిషనర్ నిబంధనలకు విరుద్ధంగా ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసినట్లు తెలిసిం ది. వాటిని ఎక్కువ ధరకు కొనుగోలు చేశారన్న విమర్శలు ఉన్నా యి. విచారణలో భాగంగా ఆ ల్యా ప్‌ట్యాప్‌లను కమిషనర్ రిజ్వీ వెన క్కి తెప్పిస్తున్నట్టు సమాచారం.

ఇది లా ఉండగా, పూర్వ కమిషనర్ తన బాధ్యతలు చేపట్టిన తర్వాత జీఎస్టీ వెబ్‌సైట్ సాఫ్ట్‌వేర్ నిర్వహణను అప్పటిదాకా ఉన్న కంపెనీకి కా కుండా మరో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ వ్యహారంలో కూడా రూ.కోట్లలో చేతులు మారినట్టు ప్రచారం జరుగుతోంది.