25-02-2025 02:47:55 AM
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తికి ‘క్వీన్స్‌లాండ్’ సహకారం తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నా రు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సోమవారం ఆయన క్వీన్స్‌ల్యాండ్ (ఆస్ట్రేలియా) రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రి రోస్ బేట్స్ నేతృత్వంలోని బృందం తో భట్టి సమావేశమయ్యారు.
రాష్ట్రప్రభు త్వం ఇకపై క్రిటికల్ మినరల్స్ టెక్నాలజీ, మైనింగ్ రంగంలో క్వీన్స్‌ల్యాండ్ సేవలను వినియోగించుకుంటుందన్నారు. తెలంగాణ, క్వీన్స్‌ల్యాండ్ మధ్య సంయుక్త మైనింగ్, క్రిటికల్ మినరల్స్ వ్యాపారానికి సింగరేణి సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందన్నారు. ఈ పరిణామం రాష్ట్ర మైనింగ్ చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచిపోతుందని అభివర్ణించారు.
2029 నాటికి 20,000 వేల మెగావాట్ల గ్రీన్‌ఎనర్జీ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. సౌర విద్యుత్, బ్యాటరీ స్టోరేజ్ సిస్ట మ్‌లకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ రంగానికి అవసరమైన వనడియం, కోబాల్ట్, ఇండియం, క్రోమియం, టైటానియం వంటి 11 రకాల కీలక ఖనిజాలు అవసరమవుతున్నాయన్నారు.
క్వీన్స్ ల్యాండ్‌లో ఆ ఖనిజాల లభ్యత అధికంగా ఉందన్నారు. దీంతో తమ ప్రభుత్వం క్వీన్స్‌ల్యాండ్‌తో ఒప్పందం చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే పై క్రిటికల్ మినరల్స్ అంశంపై అధ్యయనం, అవగాహన కోసం సింగరేణి బృందాన్ని క్వీన్స్‌లాండ్‌కు పంపిస్తామన్నారు.
సింగరేణితో మా బంధం బలోపేతం: క్వీన్స్‌ల్యాండ్ మంత్రి రోస్‌బేట్స్
మైనింగ్ రంగంలో అపారమైన అనుభవం ఉన్న సింగరేణితో ఇప్పటికే తమకు మంచి అనుబంధం ఉందని, ఆ బంధం ఇప్పుడు మరింత బలోపేతమైందని క్వీన్స్‌ల్యాండ్ మంత్రి రోస్‌బేట్స్ అన్నారు. ఇకపై క్రిటికల్స్ మినరల్స్ అయిన కోబాల్ట్, టైటానియం, గ్రాఫైట్, క్రోమియం, టంగ్ స్టన్, యాంటీమోనీ, రీనియం, ఇరిడియంతో పాటు రేర్ ఎర్త్ మినరల్స్ వంటి కీలక ఖనిజాల ఉత్పత్తిలో భాగస్వాములమవుతామ న్నారు.
మైనింగ్ రంగంలో తెలంగాణకు సహకరిస్తామని స్పష్టం చేశారు. అనంతరం మార్చిలో క్వీన్స్‌లాండ్‌లో నిర్వహించనున్న వ్యాపార సదస్సుకు రాష్ట్రప్రభుత్వాన్ని ఆహ్వానించారు. తర్వాత సింగరేణి సీఎండీ ఎన్. బలరాం సింగరేణి వ్యాపార విస్తరణకు ఉన్న అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
సమావేశంలో ప్రభుత్వ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మైఖేల్ నెగెరవి, ట్రేడ్ సీఈవో జస్టిన్ మెక్ గోవాన్, సౌత్ ఏషియా పెట్టుబడుల సీనియర్ కమిషనర్ అభినవ్ భాటియా, సౌత్ ఏషియా సీనియర్ డైరెక్టర్ మునిష్ కౌశల్, సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్‌ఎం) సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి.సూర్యనారాయణ పాల్గొన్నారు.