09-02-2025 12:02:21 AM
ముంతాజ్ ఆస్కారి మధ్వాని.. ఈమె బాలీవుడ్ కా ముంతాజ్. భారతీయ సినీ చరిత్రలోనే అందమైన నటీమణుల్లో ఒకరు. ఆ ముంతాజ్.. షాజహాన్ ఒక్కరి హృదయానికే మహారాణి. ఈ ముంతాజ్ లక్షలాది హృదయాలను ఏలిన అందాల రాణి. అందుకే ఆమెకు బాలీవుడ్ దాసోహమైంది. ముద్దుగా ముంతాజ్ అని పిలుచుకునేది. 70ల్లో బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన నటీమణుల్లో ముంతాజ్ కూడా ఒకరు. ఇండియాకు చెందిన 75 మంది ఉత్తమ బాలీవుడ్ నటుల్లో ముంతాజ్ స్థానం సంపాదించారు.
1960 చివరి నుంచి 1970 ప్రారంభం వరకూ అత్యధిక పారితోషికం అందుకున్న నటీమణుల్లో ముంతాజ్ ఒకరు. బాక్సాఫీస్ ఇండియా టాప్ నటీమణుల జాబితాలో ఏడుసార్లు.. అందులో అగ్రస్థానంలో మూడు సార్లు నిలిచారు. హాటెస్ట్ బాలీవుడ్ నటీమణుల్లో ఒకరిగా పేరుగాంచారు. 11 ఏళ్ల వయసులోనే ముంతాజ్ ‘లజ్వంతి (1958), సోనే కి చిడియా (1958)తో సినీరంగ ప్రవేశం చేశారు.
ఆ తరువాత వచ్చిన ‘ఫౌలాద్’, డాకు మంగళ్ సింగ్ ’ వంటి చిత్రాలు ఆమెపై ‘స్టంట్ ఫిల్మ్ హీరోయిన్’ అని ముద్ర వేయడంతో ఆమె కెరీర్ నిలిచిపోయింది. ఆ తరువాత కొంత గ్యాప్‌తో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన చిత్రాలు చేశారు. 1976లో ‘నాగిన్’ చిత్రం చేశాక 13 ఏళ్ల పాటు ముంతాజ్ విశ్రాంతి తీసుకున్నారు. ఆ తరువాత 1990లో ‘ఆంధియన్’ అనే చిత్రంలో నటించి ఆమె సినిమాల నుంచి రిటైర్ అయ్యారు.
తన కెరీర్‌లో ముంతాజ్ రాజేశ్ ఖన్నా, శశి కపూర్, ధర్మేంద్ర వంటి ఎందరో స్టార్స్ సరసన నటించారు. రాజేశ్ ఖన్నాతో ఆమె కెమిస్ట్రీ చూసిన ప్రేక్షకులు ఫిదా అయ్యేవారట. ఆమె జీవితానికి రాజేశ్ ఖన్నాతో సినిమాలు చేసిన సమయాన్ని గోల్డెన్ పిరియడ్‌గా పేర్కొంటారు. 15 ఏళ్ల సినీ జీవితంలో ముంతాజ్ 108 చిత్రాల్లో నటించారు.
ముంతాజ్‌పై పీకల్లోతు ప్రేమలో..
ముంతాజ్‌పై అప్పట్లో ఒక నటుడు మనసు పారేసుకున్నాడట. ఆమెపై పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడట. ఆయన మరెవరో కాదు.. షమీ కపూర్. రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్‌ను ఏలిన నటుడు. 100కు పైగా చిత్రాల్లో నటించాడు. అలాంటి నటుడు.. ముంతాజ్‌పై ‘బ్రహ్మచారి’ చిత్రం తర్వాత విపరీతమైన ప్రేమను పెంచుకున్నాడట. ముంతాజ్ మాత్రం షమీ కపూర్ ప్రపోజల్‌ను తిరస్కరించిందట.
దీనికి కారణం కపూర్ ఫ్యామిలీ పెట్టిన కండీషనే. తమ కుటుంబంలోకి వచ్చిన స్త్రీ ఎవరైనా సినిమాలను వదిలేయాల్సిందేనని కపూర్ ఫ్యామిలీ అప్పట్లో కండీషన్ పెట్టింది. కానీ ముంతాజ్‌కు తన కెరీర్‌ను వదులుకోవడం ఇష్టం లేక షమీని వదిలేసింది. 2011లో షమీ కిడ్నీ సమస్యతో మరణించారు.
రొమ్ము క్యాన్సర్‌తో..
ముంతాజ్ ఆస్కారి మధ్వాని 31 జూలై 1947లో ముంబైలో జన్మించారు. 1974లో మయూర్ మధ్వాని అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ముంతాజ్ 54 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్‌కు బారిన పడ్డారు. దాని నుంచి విముక్తి పొందేందుకు ఆరు కీమోథెరపీలు, 35 రేడియేషన్ సెషన్స్ చేయించుకున్నారు. ముంతాజ్ కూతురి వివాహ సమయంలో మరోసారి ఆమె వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ముంతాజ్ తన భర్త మయూర్ మధ్వానీతో కలిసి లండన్‌లో జీవిస్తున్నారు.