గత సర్కారు నిబంధనలను సడలించి ట్రాన్స్‌ఫర్స్
ఆదివారం రాత్రితో ముగిసిన వెబ్ ఆప్షన్లు
1,739 విద్యార్థులు లేని స్కూళ్లలో 1,609 మంది టీచర్లు
విద్యార్థుల సంఖ్యను బట్టి ఖాళీల భర్తీ
నేడు పోస్టుల కేటాయింపు
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): ప్రతి విద్యార్థికి ప్రభుత్వ పాఠశాల ల్లో నాణ్యమైన బోధన అందించేందుకు వీలుగా బదిలీల ప్రక్రియను రాష్ర్ట ప్రభుత్వం రూపకల్పన చేసింది. విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య లేకపోవడం, కొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్య కన్నా అధికంగా టీచర్ల సంఖ్య ఉండటం వల్ల విద్యా ప్రమాణాలు నానాటికీ పడిపోతున్నాయి. ఈ క్రమంలో పిల్లలు, ఉపాధ్యాయుల నిష్పత్తిలో హేతుబద్ధత తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న మార్గదర్శకాలు కొంత సవరించింది.
గతంలో 0 నుంచి 19 వరకు విద్యార్థులున్న పాఠశాలలకు ఒక ఉపాధ్యాయుడు, 20 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠశాలలకు ఇద్దరు, 61 నుంచి 90 మంది విద్యార్థులున్న పాఠశాలలకు ముగ్గురు ఉండేలా 2015, 2021లో జీవోలను తీసుకొచ్చింది. ఈ సంఖ్యలో హేతుబద్ధత లోపించడంతో దానిని సవరించి, మరింత మెరుగైన బోధన అందేలా ప్రభుత్వం నూతన బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం 1 నుంచి 10 మంది విద్యార్థులున్న పాఠశాలలకు ఒక ఉపాధ్యాయుడు, 11 నుంచి 40 మంది ఉన్న పాఠశాలలకు ఇద్దరు, 41 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠశాలలకు ముగ్గురు ఉపాధ్యాయులను కేటాయించనున్నారు.
61పైన విద్యార్థులున్న పాఠశాలలకు మంజూరైన పోస్టులన్నింటిలో ఉపాధ్యాయులను నియమిస్తారు. ఆయా పోస్టుల భర్తీకి అనుగుణంగా సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) బదిలీల ప్రక్రియను రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించింది. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యలకు అనుగుణంగా ఖాళీలను ఆన్‌లైన్‌లో చూపారు. ఇప్పటికే ఉపాధ్యాయులు (రంగారెడ్డి జిల్లా మినహా) తమ వెబ్ ఆప్షన్లు దాదాపు ఇచ్చారు. ఆదివారం రాత్రి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగుస్తుంది. వాటిని పరిశీలించిన తర్వాత సోమవారం ఉదయం ఉపాధ్యాయులు పెట్టుకున్న దరఖాస్తుల ఆధారంగా ఆయా పాఠశాలలకు వారిని బదిలీ చేసి ఆ వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచుతారు. సోమవారం ఉదయం నుంచి రంగారెడ్డి జిల్లాలోని పాఠశాలల్లో ఖాళీలకు అనుగుణంగా బదిలీల ప్రక్రియను ప్రారంభించి మూడు రోజుల్లో దానిని పూర్తి చేస్తారు.
విద్యార్థులు లేని స్కూళ్లకు నో ఆప్షన్
రాష్ర్టవ్యాప్తంగా ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు 1,739 ఉన్నాయి. వాటిల్లో 1,609 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ప్రస్తుతం 8 ఏళ్లు పూర్తి చేసుకున్నవారు తప్పనిసరిగా బదిలీ అవుతారు. ఆయా పాఠశాలల్లో ఒక్క విద్యార్థి లేనందున ప్రస్తుత బదిలీల్లో ఆ పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించరు. 8 ఏళ్లు పూర్తికాని వారు మాత్రం ఆ పాఠశాలల్లోనే ఉంటారు. బదిలీల ప్రక్రియ పూర్తయి సోమవారం ఉదయం పోస్టుల కేటాయింపు తర్వాత విద్యార్థులు లేని పాఠశాల్లలో ఉన్న ఉపాధ్యాయులు ఎంతమంది అనేది స్పష్టత వస్తుంది. ఈ స్కూళ్లలో ఒకరిద్దరు విద్యార్థులు చేరినా, అంతకన్నా ఎక్కువ సంఖ్యలో పెరిగితే వారి సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయిస్తారు. ఒక్క విద్యార్థి లేని పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు బదిలీ కావాలని కోరుకుంటే ప్రభుత్వం వెంటనే బదిలీ చేస్తుంది.
ప్రతి పైసా సద్వినియోగం
విద్యపై పెట్టే వ్యయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వృథా అనుకోకుండా భావితరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నారు. అందుకే శిక్షణ పొంది, నైపుణ్యం, అపార అనుభవం ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల బోధనలు విద్యార్థులకు అందేలా చూడాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిని హేతుబద్ధీకరించాలని ఆదేశించారు. విద్యార్థులు లేని చోట ఉపాధ్యాయుల సామర్థ్యం వృథా కావద్దనే బదిలీల్లో విద్యార్థులు లేని పాఠశాలలను వెబ్ ఆప్షన్‌లో బ్లాక్ చేశారు. మిగిలిన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఖాళీలను చూపారు.