03-03-2025 06:07:23 PM
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మేస్త్రీలదే కీలక పాత్ర..
ఇందిరమ్మ ఇండ్ల మేస్త్రీలకు శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఇండ్ల నిర్మాణంలో మేస్త్రీలదే కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం నేషనల్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (న్యాక్) వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల మేస్త్రీల శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత, గట్టితనం ఉండేలా, వ్యయాన్ని తగ్గించేలా, ఇంటి నిర్మాణ సామగ్రి వృథా కాకుండా సద్వినియోగం చేసుకోవడం వంటి అంశాలపై మేస్త్రీలకు శిక్షణ ఇస్తున్నారని అన్నారు.
పేదలకు తక్కువ ఖర్చుతో పటిష్ఠంగా, పూర్తి భద్రతతో ఇండ్లు ఎలా నిర్మించాలని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఇంటిని 400 చదరపు అడుగుల లోపు నిర్మించాలని సూచించారు.ప్రభుత్వం అందజేసే రూ.5లక్షలతో క్వాలిటీతో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నాలుగు దశల్లో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
మొదటి విడతగా బేస్మెంట్ పూర్తి అయిన తర్వాత లక్ష రూపాయలు, రెండవ విడతగా గోడల నిర్మాణం పూర్తి అయిన తర్వాత లక్ష 25 వేల రూపాయలు, మూడవ విడత స్లాబ్ పూర్తయిన తర్వాత లక్ష 75 వేల రూపాయలు, నాల్గవ విడతగా ఇంటి నిర్మాణం పూర్తి అయిన తరువాత లక్ష రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పేదలకు నిర్మించే ఇండ్లను నాణ్యంగా, దృఢంగా నిర్మించాలన్నారు. ఆరు రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా మేస్త్రీలకు టీ షర్ట్ లు, హెల్మెట్, బ్యాగు పంపిణీ చేశారు. శిక్షణ కార్యక్రమంలో 30 మంది మేస్త్రీలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి శంకర్, మెప్మా పిడి రాజేష్, మ్యాక్ అధికారిని హెప్సిబా, ఇన్స్పెక్టర్ కరుణాకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.