09-04-2025 06:19:38 PM
మండల వ్యవసాయాధికారి కిరణ్మయి..
మందమర్రి (విజయక్రాంతి): రైతులు వరి కోతల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి అధిక బిగుబడి సాధించాలని మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, కనకరాజులు కోరారు. మండలంలోని బొక్కలగుట్ట గ్రామంలో బుధవారం యాసంగి వరి పంట కోతల్లో, కోతల అనంతరం రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. యాసంగి వరి కోతల సమయం సమీపించి నందున, పూర్తి పరిపక్వత చెంది, బాగా ఆరిన వరిని మాత్రమే కోతలు చేపట్టాలని, కోయు సమయంలో గింజలో తేమ శాతం కేవలం 14 నుంచి 17 శాతం మాత్రమే ఉండాలని, హార్వెస్టర్ యంత్రం బ్లోయర్ పంక వేగం 18 నుంచి 20 ఆర్పియం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
తద్వారా తాలు, తప్ప లేని నాణ్యమైన ధాన్యాన్ని పొందవచ్చని, కొనుగోలులో ఇబ్బందులు ఉండవని వారు స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తు ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి, మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎతైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలని తద్వారా అకాల వర్షాలు వచ్చినప్పుడు కల్లాల్లోని ధాన్యం నీటిలో మునిగి తడవకుండా కాపాడుకోవచ్చని వ్యవసాయ విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, కనకరాజులు సూచించారు. మండలంలోని బొక్కల గుట్టలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులతో వారు మాట్లాడారు.
వరి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ధాన్యములో నిర్దిష్ట నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని మాత్రమే కేంద్రంలోకి అనుమతించాలని, వచ్చిన ప్రతి ధాన్యం కుప్పకు ఏఈఓ పర్మిట్ ని అనుసరించి క్రమ పద్ధతిలో వరుస సంఖ్య కేటాయించి రిజిస్టర్ లో నమోదు చేసి, ఓపిఎంఎస్ సైట్ తో వివరాలు పోల్చి చూసుకొని వెంటనే తూకం చేసి, ట్రక్ చిట్ ద్వారా రైస్ మిల్లులకు పంపించాలని, వెంటనే రైతుకు కొనుగోలు పత్రం అందించాలని సూచించారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు నీడ, చల్లని త్రాగు నీరు, ఓఆర్ఎస్ పాకెట్స్, సరిపడా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని వరి కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు ఆదేశించారు.
వరి పంట ఉత్పత్తికి సరిపడ భూమి వివరం పత్రాలతో పాటు, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా పుస్తకం తప్పనిసరిగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చినప్పుడే కేంద్రం నిర్వాహకులకు అందించాలని, దొడ్డు వడ్లు గ్రేడ్ -ఏ ధాన్యానికి రూ.2320, గ్రేడ్-బి ధాన్యానికి రూ.2300 ఒక క్వింటాలుకి మద్దతు ధరతో పాటు సన్నాలకు రూ.500 బోనస్ కూడా ప్రభుత్వం ఇస్తుందని రైతులకు తెలిపారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు దొడ్డు, సన్న రకాల వరి ధాన్యాన్ని కేంద్రంలో వేరు వేరుగా ఉంచాలని, సన్న రకాల బస్తాలను ఎరుపు రంగు సుతిల్ దారంతో కుట్లు వేసి సంచిపై ఎస్ అక్షరంతో ప్రత్యేకంగా చూపించాలని,అదే విదంగా దొడ్డు రకం ధాన్యం సంచులను ఆకుపచ్చ రంగు సుతిల్ దారంతో కుట్లు వేయాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు. సమావేశంలో బొక్కలగుట్ట గ్రామ పరిధి రైతులు,కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.