రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, ఆగస్టు 24 (విజయక్రాంతి): అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మం నగరంలోని రెండో డివిజన్ పాండురంగాపురంలో శనివారం సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. నగరాన్ని అందంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో వంద శాతం సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రణాళికలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
నిర్దేశిత సమయంలోపు పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కొత్త కాలనీలకు ప్రతిపాదనలు అందజేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల ప్రబలుతున్న నేపథ్యంలో యంత్రాంగం పారిశుధ్యంపై దృష్టి పెట్టాలన్నారు.డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, మురుగు నిల్వ లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, నగర మేయర్ నీరజ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య, కార్పొరేటర్లు పాల్గొన్నారు.