26-02-2025 12:00:00 AM
సంస్థాధ్యక్షః పణ్య సంస్థాయాం
పురాణ భాండానాం
స్వకరణ విశుద్ధానాం ఆధానం
విక్రయం వాస్థాపయేత్
తులామాన భాండాని చావేక్షేత
పౌతవాపచారాత్
కౌటిలీయం:- (4-
“సంస్థాధ్యక్షుడు, అంగడిలో అమ్మ చూపడానికి/ తాకట్టు పెట్టడానికి వచ్చిన పాత సరుకుల యజమాని ఎవరో విచారించి నిర్ధారించుకోవాలి. తదుపరి పౌతం లో (కొలమానం) దోషాలేమీ లేకుండా తూకాలు, కొలతలు వేసే వస్తువులను పరిశీలించాలి. చెప్పిన నాణ్యతా ప్రమాణాలు పాటించక పోయినా, సమయానికి సరకు అందించక పోయినా, కొలతలలో నిబద్ధత ను పాటించక పోయినా అమ్మకందారు కు జరిమానా విధించాలి” అంటాడు చాణక్య.
వస్తువు వ్యాపారముద్ర (బ్రాండ్) ఉంటే వినియోగదారునికి నమ్మకం కలుగుతుంది. వ్యాపారంలో పారదర్శకత కొనుగోలుదారుని దగ్గర చేస్తుంది. విశ్వసనీయత వినియోగదారునితో వస్తువును కొనిపిస్తుంది. నాణ్యత వినియోగదారునిలో సంతృప్తిని నింపుతుంది. వీటిని సా ధించాలంటే వాగ్దానం చేసిన దానికన్నా వినియోగదారునికి వస్తువుకు అతీతమైన విలువను ఎక్కువగా ఇవ్వగలగాలి. వినియోగదారుడు చెల్లించే డబ్బుకు సమాన మైన విలువ గలిగిన వస్తువును ఎవరైనా ఇస్తారు. ధరను తగ్గించకుండా వస్తువు వి లువను పెంచగలిగిన అమ్మకందారు వినియోగదారుని మనసును గెలుస్తాడు. నా ణ్యతా ప్రమాణాలతో ఎక్కువ కాలం మన్నిక గలిగిన వస్తువును అతడు ఎక్కువ ధరకైనా కొంటాడు.
విక్రయానంతర సేవలు నిబద్ధతతో అందించడం, సరైన ధరకు వాగ్దానం చే సిన నాణ్యతా ప్రమాణాలను పాటించడం, చెప్పిన సమయానికి వస్తువును చెప్పిన చోట అందించడం, గ్యారంటి/ వారంటీలను నిబద్ధతతో పాటించడం, బేరసారాల అనంతరం ఒప్పందం మేరకు మాత్రమే బిల్లులు వసూలు చేయడం, క్రమం తప్పకుండా వస్తువు నాణ్యతను, ఉత్పత్తుల బా గోగులు గురించి వినియోగదారునితో ముచ్చటించడం వంటివాటివల్ల వారిరువురి బంధం గట్టి పడుతుంది. లోపాలను సవరించుకునే అవకాశమూ ఉంటుంది. వినియోగదారుడు ఒకసారొక ఉత్పత్తిని కొన్నాడంటే సరైన అమ్మకందారును ఎన్నుకున్నానని, తన నిర్ణయం సరైందేననే భావనతో ఉండాలి. అప్పుడే అమ్మకాలు మరింతగా పెరుగుతాయి. పలువురికి ప్రచారమవుతుంది.
వినియోగదారుని ఫిర్యాదులు పట్టించుకోకపోయినా, పరుషంగా మాట్లాడినా, సమయానికి సేవలు అందించకున్నా, వ స్తువులో నాణ్యతా లోపం ఉన్నా అతడు వేరొక ఉత్పత్తిదారును వెతుక్కుంటాడు. అవగాహన లేకుండా వాగ్దానాలు చేస్తూ, లేని నాణ్యతా ప్రమాణాలను ఉన్నట్లుగా చెపుతూ, సమయపాలన చేయని మోసపూరిత అమ్మకందారుని అమ్మకాలు మం దగిస్తాయి.
ఒప్పందాలను మీరకూడదు
అంతర్జాతీయ ఉత్పత్తిదారుల వస్తువుల ను జాతీయ వినియోగదారులకు అం దించేప్పుడు అమ్మకందారు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడానికి ఆ సంస్థ గుర్తింపును ధృవీకరించుకోవడం అవసరం. ఉత్పత్తిదారుని వ్యాపార నేపథ్యాన్ని, వారిచ్చిన సమాచార విశేషాలను ఒకటికి రెండుమార్లు క్షుణ్ణంగా పరిశీలించాలి. చా లామంది తమ ఉత్పత్తులకు కృత్రిమ రి వ్యూలను రాయించుకోవడం, నకిలీ వ్బుసైట్‌లతో ప్రచారం చేసుకోవడం పరిపాటిగా మారింది. అలాంటి సంస్థలపట్ల అప్రమత్తంగా ఉండాలి. భౌతిక చిరునామాలను, సంప్రదింపులకు చెందిన సమాచారాన్ని నిశితంగా పరిశీలించాలి. ఉత్పత్తి ప్రామాణికతను ధృవీకరించుకోవాలి. నకిలీ వస్తువులపట్ల జాగ్రత్త వహించాలి. ఉత్పత్తుల ఎగుమతి దిగుమతులలో వస్తువు ల రవాణా పత్రాలను నిశితంగా పరిశీలించడం, వాటి జాడను ఎప్పటికప్పుడు కనిపెట్టడం అవసరం. వస్తువు చేరగానే ఒప్పదం ప్రకారం నాణ్యతలు, పరిమాణాలు, బిల్లులు, పన్నులు చెల్లించిన రసీదులు తనఖీ చేసుకోవాలి. ప్రఖ్యాత సంస్థలను మధ్యవర్తులుగా పెట్టుకోవడం వల్ల వారి పర్యవేక్షణలో ఒప్పందం ప్రకారం వస్తువులు అందుకోగలుగుతాం.
ఒక సంస్థ దాదాపు పది లక్షల విలువ గలిగిన ఉత్పత్తులను అన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక దేశానికి పంపించింది. ఓడ చేరా క దానిని తీసుకోవలసిన సంస్థ సమయానికి డెలివరీ తీసుకోలేదు. కొన్ని వారాల పిమ్మట ఆ ఉత్పత్తులను పరిశీలించి నాణ్య తా ప్రమాణాలకు అనుగుణంగా లేవని, వాటిని తిరిగి తీసుకెళ్ళమని సమాచారం పంపింది. నిజానికా సంస్థ ప్రతినిధి సమ్ముఖంలో నాణ్యతను పరిశీలించి ఆ పత్రా లను బిల్లులతో జత పరచారు. సంస్థ సరకును సకాలంలో తీసుకోకపోవడం వల్ల డమెరేజ్ (నిరాకరణ) చార్జీలు చెల్లించవలసి వచ్చింది. పంపడానికి, తెచ్చుకోవడా నికి రవాణా ఖర్చులు తడసి మోపెడయ్యాయి. అలాంటి సంస్థలపట్ల అప్రమ త్తంగా లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
నిరంతర జాగరూకత తప్పనిసరి
వినియోగదారునితో వ్యవహరించడంలో, నాణ్యతా ప్రమాణాలను పాటించ డంలో నిరంతర జాగరూకత అవసరమవుతుంది. అయితే, ఉత్పత్తి నుంచి అమ్మకం వరకు పనులన్నింటినీ యజమాని ఒక్కడే చేసుకోలేడు. దానికి అనుచరులు అవసరమవుతారు. వారిని ఎన్నుకోవడం, బృం దాలుగా ఏర్పరచడం, వారిమధ్య సమన్వయం సాధించడం, వారి అంతర్గత శక్తి సామర్థ్యాలను వెలికితీసి, సంస్థకు ఉపయుక్తంగా మలుచుకోవడానికి అవసరమైన శిక్షణను అందించడం వంటివి అవసరం.
అనుచరులకు ఇచ్చే శిక్షణ, ప్రేరణ వారిని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ఉం డాలే కాని, వారి శక్తి సార్థ్యాలను తగ్గించేలా ఉండకూడదు. చివరగా, వినియోగదారుని మానసిక స్థితిని గురించి ఒక్కమాట దు కాణదారు తాను తూచే సమయంలో త్రాసులో ఎక్కువగా పోసి అందులో నుం చి తీయడానికి, తక్కువగా పోసి తిరిగి త్రా సులో కలపడానికి మధ్య భేదం ఉంటుం ది. త్రాసులో నుంచి తీస్తే వినియోగదారునికి తనది దుకాణందారు తీస్తున్నాడనే భావన కలుగుతుంది. త్రాసులో వేస్తే తనకు ఎక్కువగా వేస్తున్నాడనే భావన కలుగుతుంది. నిజానికి ఇరువురూ సమానం గానే తూస్తారు. దానిని అవగాహన చేసుకున్న అమ్మకందారు ప్రవర్తన మాత్రమే అమ్మకాలను పెంచుతుంది.
-పాలకుర్తి రామమూర్తి