22-04-2025 12:19:59 AM
వనపర్తి టౌన్ ఏప్రిల్ 21: వరి ధాన్యం సరసమైన సగటు నాణ్యత నిబంధనలకు విరుద్ధంగా కోతలు చేసే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు హార్వెస్టర్లను సూచించారు. జిల్లాలో వరి కోతలు విస్తృతంగా కోనసాగుతున్న తరుణంలో సోమవారం మధ్యాహ్నం ఐ.డి. ఒ .సి సమావేశ హలో హార్వెస్టర్లు, వ్యవసాయ విస్తీర్ణాధికారులు, మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కొనుగోలు కేంద్రాలు సందర్శించినప్పుడు చాలా చోట్ల వరిలో తాలు, మట్టి, గడ్డి ఎక్కువగా కనిపిస్తుందని అందుకే కోతలు ఎలా ఎప్పుడు చేయాలి సరసమైన సగటు నాణ్యత (ఎఫ్. ఎ.క్యూ ) నిబంధనలు ఏమున్నాయి అనేదానిపై జిల్లాలోని కోత యంత్రాలు నిర్వాహకులు,యజమానులు, మిల్లర్లు, వ్యవసాయ విస్తీర్ణాధికారులతో అవగాహన సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
వరి చేను కోతకు వచ్చినప్పుడే కోతలు చేపట్టాలని, పక్వానికి రాకముందే కోస్తే పచ్చగా తాలు ఏర్పడుతుందన్నారు, జిల్లా లో నాణ్యతతో వచ్చే ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు.
ఈ విషయమై వ్యవసాయ విస్తీర్ణాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు, హార్వెస్టర్లకు అవగాహన కల్పించాలని లేని పక్షంలో ఆర్.టి. ఒ కు ఫిర్యాదు చేస్తే యంత్రాలు సీజ్ చేస్తారని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, ఆర్.టి. ఒ మానస, జిల్లా సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, వ్యవసాయ మండల, క్లస్టర్ అధికారులు, డి.యం., మిల్లర్లు, హార్వెస్ట్ నిర్వాహకులు, యజమానులు తదితరులు పాల్గొన్నారు.