17-04-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): రైతులు వరి కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని నాణ్యత పరిశీలించి వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సూచించారు. కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని ఆత్మ నగర్ మహిళా సమాఖ్య ఐకెపి సెంటర్ ఆధ్వర్యంలోని ఆత్మకూరు, మెట్లచిట్టాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతం రెగ్యులరుగా చెక్ చేయాలన్నారు.
తాలు లేకుండా ప్యాడీ క్లీనర్ ద్వారా శుభ్రం చేయాలని, నాణ్యత ప్రమాణాలు రాగానే ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. వాటిని సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని, ఎలక్ట్రికల్ తూకం ఎప్పటికప్పుడు సరి చూడాలన్నారు. ధాన్యం తరలింపు సమయంలో కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాలు, వడగళ్లు పడే అవకాశం ఉన్నందున తాటిపత్రులు, కవర్లు అందుబాటులో ఉండేలా చూడాలని, ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తుగా ప్లానింగ్ చేసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు అలాట్ చేసిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని కలెక్టర్ సూచించారు.
ధాన్యం తరలింపు అంశంలో రవాణా సమస్య రాకుండా అవసరమైన లారీలను కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ డాటా ఎంట్రీ చేయాలన్నారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. గ్రేడే ఏ రకం ధాన్యానికి క్వింటాల్ రూ. 2 వేల 3 వందల 20లు, సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్ రూ. 2 వేల 3 వందలు ఉంటుందన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొచ్చిన సీరియల్ నెంబర్ ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. కలెక్టర్ వెంట మెట్పల్లి ఆర్డీవో ఎన్.శ్రీనివాస్, డీఆర్డీఓ పిడి రఘువరన్, జిల్లా కో-ఆపరేటివ్ డిసిఓ మనోజ్ కుమార్, ఎంపీడీవో, ఎమ్మార్వో, సివిల్ సప్లై అధికారులు, తదితరులున్నారు.