calender_icon.png 27 November, 2024 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

27-11-2024 06:56:40 PM

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో మెనూ ప్రకారం సకాలంలో విద్యార్థులకు పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా బాలికల పాఠశాల ఆకస్మికంగా సందర్శించి వంటశాల, గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, సామాగ్రి నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, వంట చేసే సమయంలో తాజా కూరగాయలు, నాణ్యత గల సరుకులను వినియోగించాలని తెలిపారు. పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలలో భోజన వసతి సదుపాయాలు మెరుగ్గా ఉండేలా అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.

విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం, కలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇటీవల రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడా పాఠశాల హ్యాండ్ బాల్, అథ్లెటిక్స్ విద్యార్థులను అభినందించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ పోటీలలో మంచి నైపుణ్యంతో ఆడి ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా కీర్తిని చాటాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తాను స్వతహాగా హ్యాండ్ బాల్ క్రీడాకారుడిని విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు. విద్యార్థులు క్రీడలతో పాటు చదువులో రాణించి ఉన్నత స్థాయిలో నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు రమాదేవి, ఎ. టి. డి. ఓ. చిరంజీవి, ప్రధానోపాధ్యాయులు జంగు, గిరిజన ఆశ్రమ పాఠశాలల క్రీడాధికారి మీనారెడ్డి, వార్డెన్ సాయిబాబా, క్రీడా పాఠశాల కోచ్ లు అరవింద్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.