calender_icon.png 25 November, 2024 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

25-11-2024 05:54:35 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలో వివిధ మేనేజ్మెంట్ల ద్వారా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. సోమవారం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, ట్రైబల్, మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉన్న పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ట్రైబల్ వెల్ఫేర్ డిడి మణమ్మతో కలిసి జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తాహసిల్దారులు, ఎంపీడీవోలు, ఎంఈఓ లు సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని హాస్టల్స్ ను జిల్లా, మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని హాస్టల్స్ ను నిరంతరం పర్యవేక్షించాలి అన్నారు. అధికారులందరూ తమ పరిధిలోని హాస్టల్స్ ను వ్యక్తిగతంగా వెళ్లి పరిశీలించి, హాస్టల్స్ లో నెలకొన్న పరిస్థితులు ఉన్న సమస్యలపై ఫోటోలతో కూడిన నివేదిక అందించాలన్నారు. హాస్టల్స్ కు సరఫరా అయ్యే బియ్యం  నాణ్యతను ఎప్పటికి అప్పుడు పరీక్షించి రిజిస్టర్లలో సంతకం చేయాలన్నారు. హాస్టల్స్ కు సరఫరా అయ్యే బియ్యం నాణ్యత ప్రమాణాలు పాటించాలని పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. హాస్టల్స్ లోని స్టోర్ రూమ్ లలో పరిశుభ్రత పాటించాలన్నారు.

హాస్టల్స్ లోని వంట గదులలో పరిశుభ్రత పాటించాలన్నారు. హాస్టల్స్ సరఫరా బియ్యం శుభ్రం చేసిన తర్వాత స్టోర్ రూమ్ లో భద్రపరచాలన్నారు. ముందుగా వచ్చిన బియ్యాన్ని వంటకు ఉపయోగించాలని అన్నారు. పాఠశాలలో ఉత్సాహవంతులైన విద్యార్థిని విద్యార్థులలో ఒకరిని లీడర్ గా నియమించి పరిశుభ్రత పాటించే విధంగా చూడాలన్నారు. విద్యార్థులు తామే తమ ప్లేట్లను శుబ్రం పరచుకోకుండా, హాస్టల్స్ లో వర్కర్లు శుభ్రం చేసి ప్లేట్లను భద్రపరిచేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. హాస్టల్స్, పాఠశాలల్లో పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించే బాధ్యత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్ లు, హాస్టల్ వార్డునులదే అని ఆయన అన్నారు. విద్యార్థులకు అందించే ఆహారంలో ఎటువంటి పొరపాట్లు జరిగిన కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

ముందుగా అన్ని హాస్టల్స్ ను అధికారులు సందర్శించి సోలార్ వాటర్ హీటర్లు ఎన్ని ఉన్నాయి ఎన్ని పనిచేస్తున్నాయి లేదా కొత్తగా ఎన్ని కావాలి అనే పూర్తి వివరాలను నివేదికలు అందించాలని ఆదేశించారు. అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ లో మరుగుదొడ్ల సదుపాయాల గురించి నివేదికల అందించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విద్యార్థులకు నాణ్యమైన, ఆరోగ్యవంతమైన ఆహారం అందించాలని, దానికి గాను కావలసిన పరికరాలు లేదా వస్తువులు, నెలకొన్న సమస్యలు నివేదికలు అందజేయడం ద్వారా వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ అధికారులకు తెలిపారు. నవంబర్ 26 రాజ్యాంగ  దినోత్సవం పురస్కరించుకొని చేపట్టాల్సిన పనుల గురించి కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో ఎనర్జీ ఎస్, ఎంసిసి, డిసిసి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో నిర్వహించాలన్నారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉదయం 11 గంటలకు అధికారులందరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అమృత్ సరోవర్ క్రింద కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని, దానికి అనుగుణంగా కంప్యూటర్ ఆపరేటర్లను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు అందరి గృహ సర్వే పూర్తి అయినది లేనిది సరిచూసుకోవాలని తాహసిల్దారులను ఆదేశించారు. ఏ ఒక్క గృహం వదలకుండా 100% సర్వే పూర్తి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.