డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ ఈవి నరసింహ్మరెడ్డి
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ప్రతి విద్యార్థి నాణ్యతతో కూడిన విద్యాప్రమాణాలు కలిగి ఉండేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ ఈవి నర్సింహ్మరెడ్డి తెలిపారు. పోచారం మున్సిపాలిటీ ప్రతాపసింగారంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, చౌదరిగూడలోని ప్రాథమికోన్నత పాఠశాలలను మంగళవారం సందర్శించారు. ప్రతాపసింగారం లోని 9,10వ తరగతి విద్యార్థులతో వారి విద్యాప్రమాణాలు, ఉపాధ్యాయుల బోధన పని తీరును అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మౌళికవసతుల అభివృద్ధి, మధ్యాహ్న భోజనం, పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు.
డిసెంబర్ 4న నేషనల్ అచీవ్ మెంట్ సర్వే ఉన్నందున 6,9వ తరగతి విద్యార్థుల సామర్ధ్యాలను ఎన్ ఏ ఎస్ మోడల్ టెస్ట్ పలితాల మీద సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాల మీదనే ఉపాధ్యాయుల పని తీరు ఉంటుందని చెప్పారు. ప్రతి విద్యార్థికి ఉన్నత లక్ష్య సాధనతో పాటు అన్ని రంగాల పట్ల అవగాహన కలిగి ఉండేలా ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. కమీషనర్ వెంట ఎస్సీసీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్, మేడ్చల్ జిల్లా విద్యాధికారి విజయ కుమారి, ఏఎంవో రవీందర్, మండల విద్యాధికారి శ్రీధర్, ప్రధానోపాధ్యాయులు రవి కుమార్, ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు పద్మజ తదితరులు పాల్గొన్నారు.