04-03-2025 01:37:53 AM
హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): ‘ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, యూకే లో అమలవుతున్న విద్యాప్రమాణాలపై అధ్యయనం చేయాలి. తెలంగాణ పిల్లలకూ ఆ స్థాయి విద్య అందించాలి. పాఠ్యాంశాలు మారాలి. ఇప్పటికే గుజరాత్ నుంచి ఏటా 30--40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సింగపూర్‌కు వెళ్తున్నారు. అక్కడి విద్యావిధానా లను అధ్యయనం చేస్తున్నారు.
అదే తరహాలో త్వరలో మన బృందం సింగపూర్‌లో పర్యటిస్తుంది. అందుకు సం బంధించిన విధి విధానాలు సిద్ధం చేయాలి. పర్యటన అనంతరం మన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు.
హైదరాబాద్‌లో సోమవారం ఆయన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా, పాఠశాల విద్యా డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, అదనపు డైరె క్టర్ లింగయ్య, ఓపెన్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీహరితో విద్యాసంస్కరణలను సమీక్షించి మాట్లాడారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మించి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు.
వచ్చే రెండు మూడేళ్ల్లలో విద్యావిధానంలో సమూల మార్పులు రావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం సర్కార్ విద్యపై ఎంతో ఖర్చు పెడుతున్నదని, అయినప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు త్వరలో ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్లనూ సందర్శించి రావాలని, అక్కడ అమలవుతున్న మెరుగైన విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని సూచించారు.
చిన్నప్పటి నుంచే విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అవగాహన కల్పించాలని, తద్వారా హైస్కూల్ స్థాయికి సరికే వారిలో మేధస్సు పెరుగుతుందన్నారు. అధికారులు భేషజాలకు పోకుండా కన్సల్టెంట్ల సేవలను తీసుకోవాలని, వారి ఆలోచనలు వాస్తవికంగా ఉంటాయని తెలిపారు.
ఒకప్పుడు జిల్లాస్థాయిలో డీఈవోలు, ఎంఈవోలు తరచూ స్కూళ్లను తనిఖీ చేసేవారని, ఇప్పడు అలా జరగడం లేదని, డీఈవోలు, ఎంఈవోలు తమ సొంత పనులు చేసుకుంటున్నా రని చురకలంటించారు. ఒకప్పుడు స్కూళ్ల లో వక్తృత్వ, వ్యాసరచన పోటీలు జరిగేవని, విద్యార్థులను పిక్నిక్‌లకు తీసుకెళ్లేవారని, రాను రాను ఆ సంస్కృతి కనుమరుగైపోతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు.