calender_icon.png 1 November, 2024 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వాలిటీ కంట్రోల్ అస్తవ్యస్తం

17-07-2024 04:07:37 AM

పీసీ ఘోష్ కమిషన్ ముందు కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబం ధించి క్వాలిటీ కంట్రోల్ పూర్తిగా దారితప్పిందని, డిజైన్ పూర్తి కాకముందే నిర్మాణాలు జరిగినట్లు నివేదికలో ఉందని కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం పేర్కొన్నారు. మంగళవారం బీఆర్కే భవన్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆయన ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఎ) నివేదికపైనా చర్చించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు టెక్నికల్ అంశాలు, డిజైన్స్, తదితర అంశాలపై వివరాలు ఇచ్చారు. ఎన్డీఎస్‌ఏ ఇప్పటికే ఇచ్చిన రెండు నివేదికలు, సంఘటన జరిగిన తర్వాత తాత్కాలికంగా ఇచ్చిన నివేదికపై చర్చించారు. ఏ ప్రాజెక్టుకు అయినా ముంపు సహజమేనని కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా అసహజంగా చూపించిందని శ్రీరాం తెలిపారు. మహారాష్ట్ర అడ్డుకుంటుందని చెప్పడం కరెక్టు కాదని, నీటి లభ్యత పుష్కలంగా ఉన్న తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి ఉంటే బాగుండేదని కమిషన్‌కు వివరించినట్లు శ్రీరాం తెలిపారు. ప్రాణహిత కోసం ఖర్చుచేసిన రూ. 12వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆయన ఆరోపించారు. 

కేంద్ర జల సంఘం నిబంధనల మేరకు కాళేశ్వరం నిర్మించినట్లు కేసీఆర్ ప్రభుత్వం చెబుతోందని, కానీ రాష్ట్రానికి చెందిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) ఇచ్చిన వివరాల ప్రకారమే సీడబ్ల్యూసీ అనుమతులు ఇస్తుందని శ్రీరాం తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద ప్లానింగ్, డిజైన్స్, ఇన్వెస్టిగేషన్, మోడలింగ్ సహా అన్నీ కూడా రాష్ట్రానికి చెందిన సీడీఓ చేసిందని, సీడబ్ల్యూసీ చేయలేదని, అనుమతులు కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. 195 టీఎంసీల నీటి లభ్యతతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఎటువంటి సమస్య లేదని అందుకే వాటికి మాత్రమే అనుమతి ఇచ్చిందన్నారు. ఆయన వివరించిన అంశాలన్నింటిపైనా అఫిడవిట్ దాఖలు చేయాలని కమిషన్ ఆదేశించగా... గడువులోపు అందిస్తామని శ్రీరాం తెలిపారు.