థర్డ్ పార్టీ సేవల రద్దు నేపథ్యంలో వినియోగదారులకు ఎస్‌పీడీఎస్ సేవలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 ( విజయక్రాంతి): దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్) వినియోగదారులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. విద్యుత్తు సరఫరాను అంతరాయం లేకుండా అందించే క్రమంలో భాగంగా ఇటీవలనే విద్యుత్తు తీగలలో ఉండే అంతర్గత సమస్యలను గుర్తించేందుకు సరికొత్తగా ఫీడర్ యాప్‌ను తీసుకొచ్చింది. తాజాగా విద్యుత్తు బిల్లుల చెల్లింపులో థర్డ్ పార్టీ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. కేవలం విద్యుత్ సంస్థ వెబ్‌సైట్, యాప్‌లో మాత్రమే బిల్లులు చెల్లిం చాలని వినియోగదారులను కోరింది.
ఈ సేవలకు కొనసాగింపుగానే వినియోగదారులు ఎలాంటి అయోమయానికి గురి కాకుండా, బిల్లులు చెల్లించేందుకు మరింత సౌలభ్యాన్ని కల్పించడానికి ప్రతినెలా వినియోగదారులకు ఇచ్చే బిల్లులపై బిల్లు చెల్లించేందుకు వీలుగా క్యూఆర్ కోడ్‌ను ముద్రించనుంది. ఈ విధానం వచ్చే నెల నుంచి అమల్లోకి వసుందని ఎస్‌పీడీసీఎల్ అధికారులు శుక్రవారం ప్రకటించారు. టీజీఎస్‌పీడీసీఎల్ <http://tgsouther npower.org> వెబ్‌సైట్ , టీజీఎస్‌పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా బిల్లులు చెల్లించాలని అధికారులు వివరించారు. దీంతో ఇక నుంచి వినియోగదారులు ప్రతినెలా సిబ్బంది అందజేసే బిల్లులపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా బిల్లులను సులభతరంగా చెల్లించే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.