- అధిక వర్షపాతం, బలహీన కార్పొరేట్ పనితీరు కారణం
- భారీ వర్షాలతో పలు రంగాలకు ఇబ్బందులు
- ద్వితీయార్థంలో మెరుగుదల
- పూర్తి ఏడాదిలో ౭ శాతం వృద్ధి
- ఇక్రా అంచనాలు
ముంబై, నవంబర్ 20: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతానికి తగ్గుతుందని, పూర్తి ఆర్థిక సంవత్సరంలో మాత్రం 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది.
క్యూ2లో కురిసిన భారీ వర్షాలు, కార్పొరేట్ల పనితీరు బలహీనంగా ఉండటంతో సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆర్థికాభివృద్ధి రేటు తగ్గుతుందని పేర్కొంది. అయితే ఈ ద్వితీయార్థంలో (2024 అక్టోబర్-2025 మార్చి) ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయన్న అంచనాల నడుమ 2024-25 పూర్తి ఆర్థిక సంవత్సరంలో 7 శాతం జీడీపీ వృద్ధి నమోదవుతుందని ఇక్రా వివరించింది.
30న క్యూ2 గణాంకాలు
ఈ ద్వితీయ త్రైమాసికపు జీడీపీ అధికారిక గణాంకాలు నవంబర్ 30న వెలువ డతాయి. క్యూ2లో భారీ వర్షపాతం కారణంగా పలు రంగాలు ఇబ్బందులు ఎదుర్కొ న్నాయని, మైనింగ్ కార్యకలాపాలు, విద్యుత్ డిమాండ్, రిటైల్ వ్యాపారాలు దెబ్బతిన్నాయని, వీటికి తోడు ఎగుమతులు సైతం తగ్గాయని రేటింగ్ ఏజెన్సీ వివరించింది.
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 (ఏప్రిల్-జూన్) స్థూల జాతీయోత్పత్తి 6.7 శాతం వృద్ధిచెందింది. ప్రభుత్వ వ్యయం పెరుగుతున్నదని, రబీ సాగుదల ట్రెండ్ పాజిటివ్‌గా ఉన్నదని, సర్వీసులు రంగం పుంజుకుంటున్న సంకేతాలు కన్పిస్తున్నాయని, ఈ అంశాల కారణంగా పూర్తి ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి సాధ్యపడుతుందని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు.
కానీ భారీ వర్షాలతో రిజర్వాయిర్లు నిండినందున, ద్వితీయార్థంలో గ్రామీణ సెంటిమెంట్ బలపడుతుందని రేటింగ్ ఏజెన్సీ ఎకానమిస్ట్ వివరించారు.
వృద్ధి మందగమనమే
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి
ఈ క్యూ2లో వృద్ధి మందగిస్తుందని, కానీ పూర్తి ఆర్థిక సంవత్సరంలో పెద్దగా తగ్గుదల రిస్క్‌లు లేవని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ తెలిపారు. బుధవారం ఫిక్కీ సదస్సులో సేథ్ మాట్లాడుతూ కొన్ని ఉత్పత్తులు, సర్వీసుల వృద్ధి రేటు గత ఏడాది క్యూ2కంటే తక్కువగా ఉన్నదని, అయినంత మాత్రా న పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక సర్వేలో అంచనా వేసిన 6.57 శాతం వృద్ధి రేటు తగ్గే సంకేతాలు లేవన్నారు. ఆహారోత్పత్తుల ధరలు ఆందోళన కల్గిస్తున్నప్పటికీ, అంతకు మించి ద్రవ్యోల్బణం సవాలు కాదని సేథ్ చెప్పారు.
రూ.11.11 లక్షల కోట్ల దిగువనే క్యాపెక్స్
ప్రభుత్వం మూలధన వ్యయం (క్యాపెక్స్) బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.11.11 లక్షల కోట్లకంటే దిగువనే తక్కువే ఉంటుందని, కానీ గత ఏడాది క్యాపెక్స్ రూ.9.5 లక్షలకంటే ఈ ఆర్థిక సంవత్సరంలో అధికంగా ఉంటుందని ఆర్థిక కార్యదర్శి వెల్లడించారు. అక్టోబర్ ఈ-వే బిల్స్, ఈ-ఇన్‌వాయిస్‌లు పరిశీలిస్తే పూర్తి ఆర్థిక సంవత్సరంలో 6.57 శాతం వృద్ధి లక్ష్యానికి రిస్క్‌లు పెద్దగా లేవని అర్థమవుతున్నదని అజయ్ సేథ్ తెలిపారు. 1023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 8.2 శాతం వృద్ధిచెందింది.