అసామాన్య వ్యక్తి, న్యాయవాది, బహుభాషావేత,్త గొప్ప రచయి త పాములపర్తి వేంకట నరసింహారావు భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991నుంచి 1996 వరకు పనిచేశా రు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన వ్యక్తి ప్రధాని పదవిని అధిష్టించడం అదే మొదటిసారి. దేశ ఆర్థ్ధిక వ్యవస్థలో విప్లవాత్మక మైన సంస్కరణలకు బీజం వేసి, ఛిన్నాభిన్నమైన వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన మహా మేధావి ఆయన! అదే సమయంలో దేశ లౌకిక విధానానికి సంబంధించిన వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేత కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నపుడే జరిగింది.
1921 జూన్28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో బ్రాహ్మణ కుటుంబంలో పీవీ జన్మించారు. మూడేళ్ల వయసు వుండగా, పాములపర్తి రంగారావు దంపతులు ఆయనను దత్తత తీసు కోవడంతో ఆయన మకాం వంగరకు మారింది. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన పీవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రి, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యా బలం లేకపోయినా మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించగలగడం ఆయన చతురతకు నిదర్శనం.
‘వందేమాతరం’తో మొదలు
1938లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ ‘వందేమాతర’ గేయాన్ని ఆలపించారు. ఫలితం గా విశ్వవిద్యాలయం నుండి బహిష్కరణకు గురయ్యారు. ఒక స్నేహితుని సహా యంతో మహారాష్ట్రలోని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి 1940 నుండి 1944 వరకు ఎల్‌ఎల్‌బి చదివారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుచరునిగా స్వాతంత్య్రోద్యమం లోను, హైదరాబాద్ విముక్తి పోరాటంలోను పాల్గొన్నారు.
బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులైన మర్రి చెన్నారెడి,్డ శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్‌లతో కలిసి పనిచేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి వరంగల్‌లో తన చుట్టం, అత్యంత ఆప్తమిత్రుడై న పాములపర్తి సదాశివరావుతో కలిసి ‘కాకతీయ పత్రిక’ నడిపారు. అందులో ‘జయ - విజయ’ అనే పేరుతో 1950 ప్రాంతా ల్లో ఇరువురూ కథనాలు రాసేవారు.
భూసంస్కరణలకు శ్రీకారం
ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలు పరచేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో భూస్వామ్య వర్గాలు ఎదురు తిరిగాయి. పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. 1972లో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పు డు శాసనసభ ఎన్నికల్లో 70 శాతం సీట్లు వెనుకబడిన వారికి ఇచ్చి చరిత్ర సృష్టించారు. ఆ సమయంలోనే ముల్కీ నిబంధన లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకు లు ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోరుతూ ‘జై ఆంధ్ర’ ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణ నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయ లసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేశారు. వారి స్థానంలో 1973 జనవరి 8న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిపారు. అ మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రప తి పాలనను విధించింది.
వరించిన ప్రధాని పదవి
పీవీకి ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నిక ల్లో పోటీ చెయ్యకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆ సమ యంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయారు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనిపించారు. దీంతో ఆయ న వానప్రస్థం నుండి తిరిగి వచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్ని, పీవీని చుట్టుము ట్టాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించడంలో భాగంగా సంస్కరణలకు బీజం వేశారు. ఆర్థికమంత్రిగా ప్రముఖ ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్‌కు అవకాశం కల్పించడంతోపాటు ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి సంస్కరణలకు ఊతమిచ్చారు. ఫలితంగా ఆ తరువాతి కాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి అనూహ్యమనే చెప్పాలి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు.
పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత కూడా పీవీ ప్రభుత్వానిదే. కాశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా వారిని విడిపించిన ఘనత కూడా వారిదే.
ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్థాన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో, చైనా, ఇరాన్‌లతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభు త్వం సాధించిన విజయాలలో కొన్ని. 1998లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. అయన కాలం లోనే ఆటంబాంబు తయారయింది. ఈ విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించారు.
బహుభాషా కోవిదుడు
చాలా నిరాడంబరంగా జీవించి, తన పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచిన అసామాన్య వ్యక్తి ఆయన. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోకుండా, రాజకీయ జీవి తంలో వ్యక్తిగత ఆస్తులపై ఎలాంటి ఆరోపణలు ఎదుర్కోని మహోన్నత వ్యక్తిగా ఆయన్ని అభివర్ణించవచ్చు. రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్నా పీవీ తన ఇతర వ్యాపకాలను, ఎంతో ఇష్టమైన సాహిత్య కృషి, కంప్యూటర్‌ను ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవారు. కంప్యూటర్ ను ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవారు. ఆయన చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
అయన రచనల్లో ప్రఖ్యాతి చెందింది ‘ఇన్‌సైడర్’ ఆత్మకథ. ‘లోపలి మనిషి’గా ఇది తెలుగులోకి అనువాదమైంది. నరసింహారావు బహుభాషా కోవిదుడు. ఇంగ్లీషు, హిందీయేకాక అనేక దక్షిణాది భాషలుసహా మొత్తం 17 భాషలు నేర్చుకున్నారు. కోబా ల్ బేసిక్, యునిక్స్ ప్రోగ్రామింగ్ వంటి మెషీను భాషలలో కూడా ప్రవేశం సంపాదించారు. అనేక పదువులకే వన్నె తెచ్చి, 83 ఏళ్ల వయసు (2004 డిసెంబర్ 23న) లో భౌతికంగా దూరమైన పీవీ చారిత్రక గొప్పతనాన్ని భావితరాలకు అందించడం మనందరి కనీస బాధ్యత. అందుకోసం అన్ని రాష్ట్రాలలో ఉన్నత పాఠశాల స్థాయినుండి విశ్వవిద్యాలయాల వరకు, కేంద్రీ య విద్యాలయాల్లోనూ ఒక పాఠ్యాంశం గా భావితరాలకు అందించడం అవసరం.
దండంరాజు రాంచందర్ రావు
సెల్: 9849592958
నలుగురు ‘భారతరత్నాలు’
హైదరాబాద్ నడిబొడ్డున ఒకే ప్రాంతంలో, ఒకే మార్గం లో నలుగురు ‘భారతరత్న’లు విగ్రహాల రూపంలో కొలువై ఉండడం విశేషం. ఖైరతాబాద్ నుంచి పంజగుట్ట మార్గంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాలు గతంలో ఉండగా, తాజాగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం చేరింది. ఈ ఏడాదే కేంద్ర ప్రభుత్వం పీవీకి ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రకటించింది. దీంతో ఇంతకాలంగా తగిన గుర్తింపు లభించని మహానేతకు సముచిత గౌరవం దక్కినట్లయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏకంగా అయిదుగురికి ‘భారతరత్న’ ప్రకటించారు.
మాజీ ఉపప్రధాని ఎల్‌కె అద్వానీ, దివంగత మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చంద్రశేఖర్‌తోపాటు బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌లకు ఈ అత్యున్నత పురస్కారం లభించింది. వీరంతాకూడా ఆయా రంగాల్లో లబ్ధప్రతిష్ఠులే. నలుగురు ‘భారతరత్నల’ విగ్రహాలు ఒకే మార్గంలో ఉండడం చాలా అరుదు. అందుకే, ఈ కూడలిని ‘భారతరత్న సర్కిల్’ లేదా చౌక్‌గా నామకరణం చేస్తే సము చితంగా ఉంటుంది. పీవీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి.
జి.రామకృష్ణ