- చెఫ్ డి మిషన్‌గా గగన్
- పారిస్ ఒలింపిక్స్
న్యూఢిల్లీ: ఒలింపిక్ క్రీడల్లో రెండుసార్లు పతకాలు సాధించి దేశఖ్యాతిని ఇనుమడింపజేసిన తెలుగుతేజం పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో సింధు భారత్ తరఫున మహిళల పతాకధారిగా వ్యవహరించనుంది. ఒలింపిక్స్ క్రీడల ప్రారంభం రోజున సింధూ దేశం తరపున ఫ్లాగ్ బేరర్‌గా మహిళా బృందాన్ని నడిపించనుందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) సోమవారం తెలిపింది. పురుషుల తరపున టేబుల్ టెన్నిస్ (టీటీ) సీనియర్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.
ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ఇకపై పురుషుల, మహిళల విభాగాలకు వేర్వేరు పతాకధారులు ఉంటారని 2020లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) ప్రోటోకాల్ తీసుకొచ్చింది. ఇక పారి స్ ఒలింపిక్స్ ఇండియా చెఫ్ డి మిషన్ (సీడీఎం)గా హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్ వ్యవహరించనున్నాడు. గతంలో చెఫ్ డి మిషన్‌గా ఎంపికైన దిగ్గజం మేరీకోమ్ వ్యక్తిగత కారణాలతో తప్పుకుంది. దీంతో మేరీకోమ్ స్థానంలో గగన్ నారంగ్‌ను సీడీఎంగా నియమించినట్లు ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉష పేర్కొంది. జూలై 26 నుంచి మొదలుకానున్న విశ్వక్రీడలకు భారత్ తరఫున వంద మందికి పైగా అథ్లెట్లు అర్హత సాధించారు.