calender_icon.png 11 January, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బరిలో పీవీ సింధు, లక్ష్యసేన్

08-10-2024 12:08:16 AM

నేటి నుంచి ఆర్కిటిక్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీ

వన్‌టా (ఫిన్‌లాండ్): పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురావడంలో విఫలమైన భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగనున్నారు. నేటి నుంచి ఫిన్‌లాండ్ వేదికగా జరగనున్న ఆర్కిటిక్ ఓపెన్ సూపర్- 500 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆడనున్నారు.

రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సింధూ టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా.. పారిస్‌లో తృటిలో పతకం కోల్పో యిన లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. సింధూ, లక్ష్య సేన్‌తో పాటు పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్, కిరణ్ జార్జి, సతీశ్ కుమార్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

మహిళల విభాగంలో మాళవిక బన్సోద్‌తో పాటు ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్ బరిలో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో రీతుపర్ణ పర్ణ జోడీతో పాటు మిక్సడ్ డబుల్స్‌లో సతీశ్-ఆధ్య వరియత్ జంట పోటీలోకి దిగనున్నారు. ఇక మహిళల సింగిల్స్‌లో సింధూ తన తొలి మ్యాచ్‌లో కెనడా షట్లర్ మిచెల్లి లీని ఎదుర్కోనుంది.

పారిస్ అనంతరం కోచ్ అనూప్ శ్రీధర్, కొరియన్ దిగ్గజం లీ యున్‌తో జత కట్టిన సింధూ కొత్త టెక్నిక్స్‌తో అదరగొట్టాలని చూస్తోంది. అయితే సింధూకు రెండో రౌండ్‌లో జపాన్ సంచలనం టొమకొ మియాజాకి ఎదురయ్యే అవకాశముంది. ఇక పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ తొలి రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన రాస్మస్ గెమ్కేను ఎదుర్కోనున్నాడు.

గెమ్కేను ఓడిస్తే రెండో రౌండ్‌లో లక్ష్య చైనీస్ తైపీ ఆటగాడు చో చెన్‌తో తలపడే అవకాశముంది. ఇక మకావు ఓపెన్ తర్వాత గాయంతో నాలుగు నెలలు దూరమైన శ్రీకాంత్ టోర్నీ తొలి రౌండ్ లో భారత్‌కు చెందిన కిరణ్ జార్జిని ఎదుర్కోనుండగా.. సతీశ్ ఫ్రాన్స్‌కు చెందిన ఆర్నాడ్ మెర్కెల్‌తో ఆడనున్నాడు.

మహిళల సింగిల్స్‌లో సింధూ తర్వాత ఫేవరెట్‌గా కనిపిస్తోన్న మాళవిక తొలి రైండ్‌లో చైనీస్ తైపీ క్రీడాకారిణి సుంగ్ యున్‌ను ఎదుర్కోనుండగా.. ఆకర్షి కశ్యప్ జర్మనీకి చెందిన వొన్నె లితో తలపడనుంది.