calender_icon.png 19 November, 2024 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీవీ సేవలు చిరస్మరణీయం

29-06-2024 01:21:58 AM

  1. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 
  2. నెక్లెస్ రోడ్డులో పీవీ ఘాట్ వద్ద జయంతి వేడుకలు 
  3. కాంగ్రెస్‌తో పాటు వివిధ పార్టీల నేతల నివాళులు 

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి) : పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను తెలుగు జాతి ఎప్పటికి గుర్తుంచు కుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆయన కాంగ్రెస్ నేత అని చెప్పుకోవడానికి గర్వంగా భావిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పీవీ 103వ  జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌లోని మంత్రి కోమటిరెడ్డి, పీసీసీ మాజీ అధ్య క్షుడు వీ హనుమంతరావు, మాజీ మంత్రి జానారెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ నేత వాణిదేవి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్  తదితరులు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ‘పీవీ నరసింహారావు నాడు సంస్కరణలు అమలు చేయకపోయుంటే దేశం ఇవాళ ఈ స్థితిలో ఉండేది కాదు.  ఆయన మేధావి కాబట్టే అద్భుతమైన పాలన అందించారు. తెలుగు బిడ్డ , తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు శ్రద్దాంజలి ఘటిస్తున్నా’ అని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉండటంతో ఇక్కడికి రాలేకపోయారని మంత్రి తెలిపారు.

తెలుగు ప్రజలు గర్వించదగ్గ వ్యక్తి : జానారెడ్డి 

పీవీ తెలుగు ప్రజలు గర్వించేదగ్గ వ్యక్తి అని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు.  ఇప్పుడున్న ప్రభుత్వం మాటలతో కాకుండా చేతుల్లో చూపాలన్నారు. ఆర్థికాభివృద్ధికి ఆయన చేసిన దోహదం ఎంతో స్ఫూర్తి అని జానారెడ్డి పేర్కొన్నారు. పీవీ తనను ఎంతో ఆదరించారని,  ఆయనతో ఉన్న సంబంధాలను మర్చిపోలేనని చెప్పారు.  

సోషలిస్టు నేతగా ఎదిగారు : కోదండరామ్ 

పీవీ సోషలిస్టు భావాలు కలిగిన నేత అని టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా బాధ్యతలు చేపట్టిన పీవీ.. భూ సంస్కరణలు అమలు చేసి పేద వాళ్లకు భూములు దక్కేలా చేశారని పేర్కొన్నారు. పీవీ చేసిన రచనలు ఎంతో గొప్పవని కొనియాడారు. 

భూ సంస్కరణలు పీవీవే : వీహెచ్ 

పీవీ ఒక దూరదృష్టి కలిగిన వ్యక్తి అని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు. తన భూములను పేదలకు పంచిపెట్టడమే కాకుండా భూ సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచారని తెలిపారు. భూ సంస్కరణల చట్టాన్ని తీసుకొచి అమలు చేయాలని ఇందిరాగాంధీకి పీవీనే  చెప్పారని వీహెచ్ తెలిపారు. పీవీ నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా తానేనని గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ లేకపోయినా ఐదేళ్లు ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపారని కొనియాడారు.  

ఉగ్రవాదం అణిచివేతలో పీవీది కీలకపాత్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ 

పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలనే ఆ తర్వాత వచ్చిన పాలకులు అమలు చేస్తున్నారని, దేశంలో ఉగ్రవాదాన్ని తగ్గించడంలో పీవీ పాత్ర ఎంతో కీలకమైందని ప్రభుత్వ సలహాదారు, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు హర్కర వేణుగోపాల్ పేర్కొన్నారు. కశ్మీర్‌తోపాటు పంజాబ్‌లోని ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని తగ్గించారని గుర్తు చేశారు.  గాంధేయ వాది గా పార్టీలో పీవీకి ఎంతో గుర్తింపు ఉండేదన్నారు. రాష్ట్రంలో పీసీసీ చీఫ్‌గా, సీఎంగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా, ప్రధాన మంత్రిగా పదవులు చేపట్టడం ఒక్క పీవీకే సాధ్యమైం దన్నారు. నిజాంకు వ్యతిరేకంగా రామనందాతీర్థ నేతృత్వంలో పీవీ పోరాటం చేశారని, వందేమాతరం  ఉద్యమంలో పాల్గొనడంతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారని, మహారాష్ట్రకు వెళ్లి న్యాయ విద్యను, జర్నలిజం కోర్సును పూర్తి చేశారని తెలిపారు.  

పీవీ సేవలను గుర్తించింది మోదీనే  : బీజేపీ నేత ఎన్వీ సుభాష్ 

పీవీ ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చారని పీవీ మనవడు, బీజేపీ నేత ఎన్వీ సుభాష్ అన్నారు. భూ సంస్కరణలు తీసుకొచ్చి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, వాటిని ప్రతి ప్రభుత్వం పాటిస్తోందన్నారు. మోడీ సర్కార్ పీవీ సేవలను గుర్తించి భారతరత్న ఇచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పీవీని ఎలా అవమానించిందనేది చూ శామన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆయన్ను రాజకీయంగా ఉపయోగించుకున్నదని తెలిపారు.  కాంగ్రెస్ నేతలు పీవీ ఘాట్ వద్దకు రాకుండానే శుభాకాంక్షలు తెలుపుతున్నారని పేర్కొన్నారు.

గాంధీభవన్‌లో.. 

మాజీ ప్రధాని పీవీ జయంతిని గాంధీభవన్‌లో  నిర్వహించారు. ఆయన చిత్రపటా నికి నివాళులు అర్పించి దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో  పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హను మంతరావు,  రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, నాయకులు సంగి శెట్టి జగదీష్ , అల్లం భాస్కర్ , భవానిరెడ్డి , లింగంయాదవ్,  రాపోలు జయప్రకాశ్, ప్రేమలతా అగర్వాల్  తదితరులు ఉన్నారు. 

పీవీకి మంత్రి జూపల్లి నివాళి

కొల్లాపూర్ క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 103వ జయంతిని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృత్రిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పీవీ చిత్రపటానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

పీవీకి భారతరత్న రావడం గొప్ప విషయం : 

పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి 

పీవీ జయంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసిందని పీవీ కూతురు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ సరభివాణిదేవి పేర్కొన్నారు. ఈ ఏడాదికి ప్రత్యేకత ఉందని, పీవీకి భారతరత్న రావడం గొప్ప విషయమన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలోనూ ప్రధానిగా దేశాన్ని చాలా చక్కగా పాలించారని వాణిదేవి పేర్కొన్నారు. ఆయనకు ఎంత చేసినా తక్కువేనని, ఇంత గొప్ప మేధావి తెలంగాణ బిడ్డ అని చెప్పుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. మంది మార్బలం లేకుండా మేధా సంపత్తితో అంచలంచెలుగా ఎదగొచ్చని చూపించారని తెలిపారు.