calender_icon.png 23 October, 2024 | 1:44 PM

10 లక్షల మార్క్‌కు పీవీ విక్రయాలు

13-07-2024 12:21:32 AM

జూన్ త్రైమాసికంలో రికార్డు

న్యూఢిల్లీ, జూలై 12:  ఈ ఏడాది ఏప్రిల్ త్రైమాసికంలో పాసింజర్ వాహనాల (పీవీ) హోల్‌సేల్ విక్రయాలు తొలిసారిగా 10 లక్షల మార్క్‌ను దాటాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సియామ్) వెల్లడించింది. యుటిలిటీ వాహన విక్రయాలు జోరుగా సాగడంతో కార్ల కంపెనీలు డీలర్లకు సరఫరా చేసిన కార్ల సంఖ్య ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 10,26,006 యూనిట్లకు పెరిగాయన్నది. నిరుడు ఇదే త్రైమాసికంలో 9,96,565 యూనిట్ల హోల్‌సేల్ విక్రయాలు జరిగాయి.

తాజాగా ముగిసిన క్యూ1లో మొత్తం పాసింజర్ వాహనాల్లో యుటిలిటీ వాహన విక్రయాలు 18 శాతం వృద్ధితో 6,54,794 యూనిట్లకు చేరగా, పాసింజర్ కార్ల విక్రయాలు మాత్రం 17 శాతం తగ్గి 3,41,293 యూనిట్లుగా నమోదయ్యాయి. వ్యాన్ల అమ్మకాలు 10 శాతం మేర పెరిగి 38,919 యూనిట్లకు చేరాయి. మొత్తం పాసింజర్ వాహన విక్రయాల్లో యుటిలిటీ వాహనాల వాటా 63 శాతమని, సెడాన్ విభాగం నుంచి యుటిలిటీ వాహనాలకు వినియోగదారులు షిఫ్ట్‌కావడమే ఇందుకు కారణమని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ శుక్రవారం మీడియాకు తెలిపారు.