calender_icon.png 24 December, 2024 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక విప్లవానికి నాంది పీవీ

24-12-2024 02:00:00 AM

  1. జ్ఞాన సంపదకు నిలువెత్తు నిదర్శనం  
  2. పీవీ చూపిన మార్గంలో యువత నడవాలి  
  3. ప్రపంచంతో పోటీపడేలా సంస్కరణల అమలు 
  4. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 
  5. 20వ వర్ధంతి సందర్భంగా పీవీ జ్ఞానభూమి వద్ద నివాళులర్పించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (విజయక్రాంతి): వినూత్న సంస్కరణలతో దేశంలో ఆర్థిక విప్లవాన్ని సృష్టించి ఆర్థిక ప్రగతికి నాంది పలికిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశంలో నూతన ఆర్థిక విధానాలకు రూపశిల్పి, బహుభాషా కోవిదుడు పీవీ అని కొనియాడారు.

సోమవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు పీవీ మార్గ్‌లోని పీవీ జ్ఞానభూమి, పీవీఘాట్ వద్ద 20వ వర్ధంతి సంస్మరణ సభ సందర్భంగా పీవీ కుటుంబ సభ్యులతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. దేశ ఆర్థిక పరిస్థితి కష్టతరంగా ఉన్నపుడు ఎన్నో సంస్కరణలు చేపట్టి, దేశాభివృద్ధికి ఎనలేని కృషిచేశారని చెప్పారు. విద్యావ్యవస్థలో నూతన ఒరవడిని సృష్టించారని పేర్కొన్నారు. ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఇతర ప్రముఖులు నివాళులర్పించారు.

రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాలచారి, హర్కర వేణుగోపాల్, రాష్ర్ట ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు రావూరి ప్రకాశ్‌రెడ్డి, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, నాయకులు వకుళాభరణం కృష్ణమోహన్, పీవీ రాజేశ్వర్‌రావు, అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అపర చాణక్యుడు పీవీ: మంత్రి పొన్నం ప్రభాకర్ 

తెలంగాణ ముద్దు బిడ్డ  పీవీ నరసింహారావు అని, పీవీ తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందినవారు కావడం గర్వకారణమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ప్రధాని వరకు స్వయంకృషితో ఎదిగారని కొనియాడారు. బహుభాషా కోవిదుడుగా, అపారజ్ఞానంతో అపర చాణక్యుడిగా రాజకీయంగా పదవులే తన వద్దకు వచ్చే విధంగా పనిచేశారని గుర్తుచేసుకున్నారు. మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఆయన మౌనంగా ఉంటూనే దేశానికి ప్రధానిగా పనిచేయడం అందరికీ గర్వ కారణమన్నారు. అనంతరం పీవీ కుటుంబీకులతో కలిసి పీవీ నరసింహారావు క్యాలెండర్ ఆవిష్కరించారు. పీవీ ఘాట్ ఎదుట ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి, కళ్లజోళ్లను పంపిణీ చేశారు.

పీవీ సేవలు మరువలేనివి: మంత్రి శ్రీధర్‌బాబు

దేశానికి పీవీ నరసింహారావు చేసిన సేవలు మరువలేనివని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. విద్యతోనే వ్యక్తిత్వ వికాసం, సమాజం బాగుపడుతుందని భావించి రాష్ట్రంలో గురుకులాలు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నవోదయ పాఠశాలలను పీవీ ఏర్పాటు చేశారని గుర్తుచేసుకున్నారు. ఆదర్శవంతమైన రాజకీయ జీవితంతో ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ ప్రపంచంలో అన్ని విధాల పేరు వచ్చేలా దేశాన్ని తీర్చిదిద్దారని కొనియాడారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నుంచి పీవీ రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ సీఎం, దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు చేపట్టారని పేర్కొన్నారు. 

అపర మేధావి పీవీ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

దేశాన్ని ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దిన అపరమేధావి పీవీ నరసింహారావు అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న సమయంలో ఎన్నో సంస్కరణలు చేపట్టి ప్రపంచంతో పరుగులు పెట్టించారని కొనియాడారు. 

భూసంస్కరణలకు ఆద్యుడు పీవీ:  మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్

దేశ మొదటి ప్రధాని నెహ్రూ ప్రసంగాలతోపాటు పీవీ ప్రసంగాలు కూడా ఐక్యరాజ్యసమితిలో పోల్చిచూసిన వారున్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. పీవీ అనగానే ఆర్థిక సంస్కరణలు గుర్తుకొస్తాయని, కానీ ఆయన భూసంస్కరణలు, విద్యాసంస్కరణలకు ఆద్యుడని స్పష్టంచేశారు. గురుకులాలు, ఉపాధిహామీ పథకం, ఆర్టీఐ లాంటి వాటికి పీవీనే పునాదులు వేశారని గుర్తుచేశారు. మహిళా సాధికారత, యువత రాజకీయాల్లోకి రావడం, టెక్నాలజీ నేర్చుకోవాలని ఆయన ప్రోత్సహించేవారని పేర్కొన్నారు. 

వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చి దేశాన్ని ఏలారు: ఎమ్మెల్సీ సురభి వాణీదేవి

నలబై ఏండ్ల క్రితం దక్షిణ భారతదేశానికి చెందిన వారిని మద్రాసీ అనేవారని.. వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన మహామేధావి పీవీ నరసింహారావు దేశాన్ని ఏలారని ఆయన కూతురు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. నాడు దేశ పరిస్థితిని చూసి సంస్కరణలు తీసుకొచ్చి భారత్‌కు దశ దిశను చూపారని తెలిపారు. కుల, మత, కాల, రాజకీయాతీతుడు పీవీ అని కొనియాడారు.  

భారతీయులకు గుర్తింపు తెచ్చింది పీవీనే: కే కేశవరావు

ప్రపంచ దేశాల ముందు భారతీయులకు గుర్తింపు తెచ్చింది పీవీ నరసింహారావేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు అన్నారు. గతంలో పీవీ ఘాట్ అభివృద్ధి కోసం కేటాయించిన డబ్బులు మిగిలి ఉన్నందున వాటిని ఖర్చుచేసి పీవీఘాట్‌ను అభివృ ద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. 

తెలంగాణ గడ్డపై పుట్టి అంతర్జాతీయ ఖ్యాతి : పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

తెలంగాణ గడ్డపై పుట్టిన పీవీ నరసింహారావు అంతర్జాతీయ ఖ్యాతిని పొందారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆ యన కాంగ్రెస్ ఆస్తి అని, పీవీ మరణానంతరం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పీవీఘాట్‌ను, దామోదర సంజీవయ్య, ఎన్టీఆర్ ఘాట్‌లను కూడా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 1994లో పీవీ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.