calender_icon.png 20 November, 2024 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో భారత్‌లో పుతిన్ పర్యటన

20-11-2024 12:53:34 AM

న్యూఢిల్లీ, నవంబర్ 19: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్లు క్రెమ్లిన్ ప్రెస్ సెక్రటరీ దిమిత్రీ పెస్కోవ్ ప్రకటించారు. పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదని, ఈ విషయంలో రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బహుశా జనవరిలో పర్యటన ఉండొచ్చని వెల్లడించారు. పుతిన్ చివరిసారిగా 2021లో ఢిల్లీలో జరిగిన భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు.

ఆ తర్వాత అక్టోబర్‌లో రష్యాలోని కజన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పుతిన్‌ను భారత్‌లో పర్యటించాలని ఆహ్వానించారు. పుతిన్ సుముఖత వ్యక్తం చేయడంతో పర్యటనకు అడుగులు పడ్డాయి. పుతిన్ పర్యటనతో రెండు దేశాల మధ్య  దౌత్య, వాణిజ్యపరమైన సంబంధాలు మరింత బలపడనున్నాయి.

2022లో రష్యా  ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. రెండు దేశాల మధ్య యుద్ధం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన వేళ పుతిన్ భారత్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది.