calender_icon.png 22 September, 2024 | 4:39 AM

పచ్చని చెట్టుపై గొడ్డలి పెట్టు

22-09-2024 01:57:14 AM

  1. ఎర్రచందనం, టేకు చెట్లు నరికివేత
  2. సూర్యాపేట పీజీఎప్ నర్సింగ్ కళాశాల నిర్వాకం
  3. అమ్ముకునేందుకు నిర్వాహకుల యత్నం?

సూర్యాపేట, సెప్టెంబర్ 21: పచ్చదనాన్ని పంచుతూ ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే చెట్లపై అవినీతి చూపు పడటంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40కి పైగా అత్యంత విలువైన ఎర్రచందనం, టేకు చెట్లు నేలకొరిగాయి. సూర్యాపేట పట్టణంలోని జనగామ రోడ్డు లయోలానగర్‌లో గల పీజీఎప్ నర్సింగ్ కళాశాల ఆవరణలో 15 ఏండ్ల క్రితం నాటిన ఎర్రచందనం, టేకు చెట్లు ఏపుగా పెరిగాయి. ఒక్కో చెట్టు విలువ రూ.వేలల్లో ఉండగా అన్నింటి విలువ లక్షల రూపాయల్లో ఉంటుంది. వీటిని నాలుగు రోజుల క్రితం ఎటువంటి అనుమతులు లేకుండా కొట్టివేశారు. గమనించిన స్థానికులు తమ మొబైల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బయటకు వచ్చింది.

నరికివేతపై అనుమానాలు 

కళాశాల ఆవరణలో ఉన్న అత్యంత విలువైన చెట్లను ఎవరికి తెలియకుండా గుట్టుగా నరికి కళాశాల ఆవరణలోనే కొమ్మలను తీసేసి దుంగలను కావాల్సిన సైజులో ముక్కలు చేసి ఉంచారు. పెద్ద సైజులో గల కొన్ని మొద్దులను ఆరు, ఏడడుగుల ఎత్తులో అలాగే ఉంచి పైభాగాలను పూర్తిగా నరికివేశారు. ముందస్తుగానే జాగ్రత్తగా కావాల్సిన సైజులో ముక్కలు చేయడంతో పాటు, తరలించేటప్పుడు నిలువుగా ఉంచిన పెద్ద దుంగలను వెంటనే నరికి లోడు చేసేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తున్నది. 

అక్రమంగా అమ్ముకునేందుకే..

ఎటువంటి అనుమతులు లేకుండా లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం, టేకు చెట్లను అక్రమంగా అమ్ముకునేందుకే కళాశాల నిర్వాహకులు అనుమతులు లేకున్నా నరికారని పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వాటిని అమ్మాలంటే కళాశాల ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇచ్చి తదుపరి ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి అనుమతి పొందిన తర్వాతే నరికివేయాలి. అవేమీ పట్టించుకోకుండానే నరికివేయడంతో అనుమానాలకు తావిస్తున్నది. 

విద్యుత్‌శాఖపై బుకాయింపు

అయితే కళాశాలలో అక్రమంగా చెట్లు నరికారనే విషయం బయటకు పొక్కడంతో అమ్మాలనే ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తున్నది. ఇదే విషయమై కళాశాల నిర్వాహకులను సంప్రదించగా విద్యుత్‌శాఖ పని అంటూ బుకాయించినట్లు తెలుస్తుంది. జనగామ రోడ్డుకు దగ్గరలో ఈ చెట్లు ఉండడంతో విద్యుత్ తీగలకు తగిలి పదేపదే విద్యుత్ సమస్యలు తలెత్తున్న కారణంగా ఆ శాఖాధికారులే వచ్చి చెట్లను నరికించారని ఆ శాఖపై నెట్టివేస్తున్నట్లు సమాచారం. అయితే జనగామ రోడ్డుకు పక్కన విద్యుత్ లైన్‌కు ఇరువై అడుగులకు దూరంగా ఈ చెట్లు ఉండటం గమనార్హం.

అనుమతులు తప్పని సరి

ఎవరైనా తమ ఇండ్లలో కానీ, తమకు చెందిన వ్యవసాయ భూముల్లోగానీ పెంచిన చెట్ల్లను ఇష్టం వచ్చినట్లు కొట్టే హక్కు ఉండదు. వాటిని కొట్టాలంటే అనుమతులు తప్పని సరి. ఎర్రచందనం, టేకు వంటి విలువైన చెట్ల విషయంలో ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాల్సిందే. ఈ చెట్లను కొట్టాలంటే రెవెన్యూ, అటవీశాఖాధికారుల నుండి అనుమతులు పొందాలి. లేదంటే అటవీ చట్టాలను అనుసరించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

అటవీ శాఖ అధికారుల తనిఖీలు

చెట్లు నరికిన విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే కళాశాలలో తనిఖీ చేశారు. కళాశాల ఆవరణలో ఎర్రచందనం, టేకు దుంగలు ఉండటంతో వాటన్నింటికి నంబర్‌లు వేసి వాటిని ఎట్టిపరిస్థితిలో ఎక్కడికి తరలించకూడదని చెప్పి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనపై అటవీశాఖాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ వారికి జరిమానా విధించనున్నట్లు తెలుస్తుంది. 

మాకు సంబంధమే లేదు

నర్సింగ్ కళాశాలలోకి వెళ్లి మాకు చెట్లు నరకాల్సిన అవసరం లేదు. మా శాఖకు ఆ చెట్ల నరికివేతకు ఎటువంటి సంబంధం లేదు. వారు ఎందుకు కొట్టారో కూడా మాకు తెలియదు. అయితే గతంలో ఆ కళాశాలలో ఓ చెట్టు కూలి విద్యుత్ లైన్‌పై పడగా దానిని తీసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాం. అంతే తప్ప ఈ ఘటనకు మాకు సంబంధమే లేదు.

 యశ్వంత్, ఏఈ విద్యుత్ శాఖ, సూర్యాపేట

నరికింది విద్యుత్ శాఖ వారే

కళాశాలలో చెట్లు నరికిన మాట వాస్తవమే. చెట్లు విద్యుత్‌లైన్‌కు తగులుతున్నాయని నరికివేయాలని విద్యుత్ శాఖ వారు చెప్పడంతో సరే అన్నాను. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. మా పైఅధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాతే ఈ నిర్ణయాన్ని చెప్పా. అసలు ఇవి ఎర్రచందనం చెట్లు అని నాకు తెలియదు. కొట్టిన తర్వాత పలువురు వచ్చి చెబితేనే తెలిసింది.                        

కరుణాకర్, పీజీఎప్ నర్సింగ్ కళాశాల డైరెక్టర్, సూర్యాపేట