- అవినీతి అధికారులను వదిలిపెట్టే ప్రసక్తిలేదు
- ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన అధికారులను వదిలే ప్రసక్తిలేదని, వ్యవస్థలను 100 రోజుల్లో గాడిన పెడుతానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. శనివారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. వాటిని పరిష్కరించడమే లక్ష్యమని, రెవెన్యూ సంబంధిత సమస్యలపై అధికంగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సమస్యలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గత పాలకుల కారణంగా ప్రతి మండలంలో భూకుంభకోణం జరిగిందని, రికార్డులను తారుమారు చేశారని ఆరోపించారు. రీసర్వే అస్తవ్యస్తంగా జరగడంతో ప్రజలకు ఇబ్బందులు వస్తాయని, ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. రెవెన్యూ శాఖను గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారని, మదనపల్లె ఘటన ఈ శాఖలో జరిగిన అక్రమాలకు అద్దం పట్టిందన్నారు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని, భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినతులు ఇచ్చేందుకు అమరావతికి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. నియోజకవర్గాలు, జిల్లాలో ఫిర్యాదులు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ భవన్‌కు తరలివచ్చిన ప్రజలు
సీఎం చంద్రబాబును కలిసి వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారితో ఎన్టీఆర్ భవన్ కిక్కిరిసిపోయింది. ప్రతి ఒకరి దగ్గరికి వెళ్లి చంద్రబాబు వినతులు స్వీకరించారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానంటూ వినతులు అందజేశారు. గత ప్రభుత్వం వేధింపులతో బాధితుల్లా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.