calender_icon.png 3 October, 2024 | 4:02 AM

బియ్యంగాదు.. అన్నం పెట్టండి

05-09-2024 01:15:08 AM

  1. ఖమ్మం వరద బాధితుల ఆక్రందన 
  2. ఇంకా జలదిగ్బంధంలోనే కాలనీలు 
  3. కొలిక్కిరాని శానిటేషన్ కార్యక్రమాలు 
  4. ముంపు ప్రాంతాల్లో పోలీస్ సేవలు 
  5. రేపటి నుంచి బాధితులకు ఆర్థిక సాయం 

ఖమ్మం, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): “మాకు బియ్యంగాదు.. అన్న పెట్టండి” అని ఖమ్మం వరద బాధితులు కోరుతున్నారు. మూడు రోజులైనా ఇంకా ఖమ్మం జలదిగ్భందంలోనే ఉంది. బాధితులు ఇబ్బందులతోనే సహవాసం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని వాపోతున్నారు. బియ్యం, పుప్పులు బుధవారం పంపిణీ చేయాగా.. వాటితో ఎలా వండుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇళ్లంతా బురద, చెత్తా చెదారంతో నిండి ఉంటే గ్యాస్ బండలు, స్టౌవ్‌లు లేకుండా వంట ఎలా చేసుకుంటామని ప్రశ్నిస్తున్నారు.

పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు ప్రభుత్వమే వండిన భోజనాలు ఇంటింటికీ సరఫరా చేయాలని కోరుతున్నారు. లక్షలాది రూపాయలు నష్టపోయి, సర్వం కోల్పోయిన తమకు ప్రభుత్వం ఇస్తామంటున్న రూ.10వేలు ఎందుకూ సరిపోవంటున్నారు. సాధ్యమైంత త్వరగా అంచనాలు రూపొందించి న్యాయమైన రీతిలో నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. ఇళ్లు కూలిపోయాయని, తలుపులు, కిటీకీలు, సామాన్లు వరద ఉధృతికి కొట్టుకుపోయాయని రోధిస్తున్నారు.

పాములు తమ మధ్యే సంచరిస్తున్నాయని, దోమలు వీరవిహారం చేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. శానిటేషన్ కార్యక్రమాలు పూర్తిగా చేయడం లేదని ఆరోపిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక దృష్టి పెట్టి తమను అన్ని విధాల ఆదుకోవాలని కోరుతున్నారు. 

కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు

బొక్కలగడ్డ, రాజీవ్ గృహ కల్ప, ప్రకాశ్‌నగర్, ఆర్టీసీ కాలనీ, వెంకటేశ్వరనగర్ మోతీనగర్ ప్రాంతాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. 100 ట్రాక్టర్లు, 70 జేసీబీలు, జిల్లాలోని అన్ని ఫైర్ ఇంజన్లు తెప్పించి ఇళ్లల్లోని బురదను తొలగిస్తున్నారు. వరద ప్రాంతాల్లో 525 మంది ట్రెయినీ కానిస్టేబుళ్లు పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు.

రోడ్లపై విరిగి పడిన విద్యుత్ స్తంభాలను సరిచేశారు. మంత్రులు, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, నగర కమిషనర్ అభిషేక్ ఆగస్త్య, మేయర్ నీరజ పనులను పర్యవేక్షించారు. బియ్యం, నిత్యావసర వస్తువులు, పాలు పంపిణీ చేశారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థల నేతృత్వంలో భోజనాలు అందజేస్తున్నారు. 

99శాతం సాధారణ స్థితికి తెచ్చాం

బుధవారం నాటికి ఖమ్మంలో పరిస్థితిని 99 శాతం వరకు సాధారణ స్థితికి తీసుకొచ్చామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుందన్నారు. బుధవారం ఖమ్మంలోని నగర కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గురువారం నుంచి ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కరెంట్ సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సర్టిఫికెట్స్, ఇతర డాక్యుమెంట్లు పోయిన వారికి హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి అందజేస్తామన్నారు.  అన్నీ కాలనీల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 75 పీఆర్ రోడ్లు దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతులు చేపడుతామన్నారు.

రేపటి నుంచి ఆర్థిక సాయం

రేపటి నుంచి బాధితులకు ప్రకటించిన రూ.10 వేల సాయాన్ని కూడా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. నగరంలోని 10 డివిజన్లలో దాదాపు 5 వేల కుటుంబాలకు పైగా వరదల్లో నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. నలుగురు చనిపోయారని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు బాధితుల ఖాతాల్లోనే నేరుగా జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మహబాబాబాద్‌లో మృతి చెందగా, ఖమ్మం జిల్లాలోని ఏర్రుపాలెం, మధిరలో ఒక్కొక్కరు మొత్తం నలుగురు చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు.