calender_icon.png 25 December, 2024 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండోసారి.. ఠాణాలో పుష్పరాజ్

25-12-2024 02:03:53 AM

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ౪ గంటలపాటు.. విచారణకు హాజరైన హీరో అల్లు అర్జున్

  1. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై 2౦ ప్రశ్నలు
  2. అల్లు అర్జున్‌ను విచారించిన సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ 
  3. మరోసారి విచారణకు పిలిచే చాన్స్ 
  4. తాజాగా ఏ-18గా పుష్ప సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ 
  5. కేసు వెనక్కి తీసుకుంటాను: శ్రీతేజ్ తండ్రి భాస్కర్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (విజయక్రాంతి): సంధ్య థియేటర్ ఘనటలో మరోసారి సినీ నటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించారు. మం గళవారం ఉదయం 11:05 గంటలకు తన తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.

వీరితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి, బన్నీవాసు, లాయర్ అశోక్‌రెడ్డి ఉన్నారు. సం ధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన.. తదనంతర పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్‌ను మధ్యాహ్నం 2:50 గంటల వరకు ప్రశ్నించారు.

ఏసీపీ రమే ష్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ ఆయనను ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల విడుదల చేసిన 10 నిమిషాల వీడియో ఆధారంగా అయనను ప్రశ్నించినట్టు సమాచారం.

2౦ ప్రశ్నలపై స్టేట్‌మెంట్ రికార్డు

అల్లు అర్జున్‌ను పోలీసులు సుమారు 20 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా అల్లు అర్జున్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌లో ప్రస్తావించిన అంశాలపైనా  పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇటీవల సంధ్య థియేటర్ మేనేజర్ నాగరాజును పోలీసులు కస్టడీకి తీసుకొని వివరాలు రాబట్టారు.

పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల రాకకు పోలీసులు అనుమతి తిరస్కరించినట్లు నాగరాజు అంగీకరించారు. అయితే, ఈ విషయాన్ని నాగరాజు చెప్పారా? లేదా? అనే విషయంపై అల్లు అర్జున్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

థియేటర్ యాజమాన్యం నుంచి సమాచారం అందిందా? లేదా? అందినప్పటికీ అల్లు అర్జున్ ప్రీమియర్‌షోకు వచ్చారా? అనే అంశంపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అయితే పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ తడుముకోకుండా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. మీకు రేవతి మరణ వార్త తరువాత రోజు తెలిసిందా? అని ప్రశ్నించగా.. నాకు తరువాత రోజే తెలిసింది 

అని చెప్పాడు. ఏసీపీ, డీసీపీ మిమ్మల్ని థియేటర్‌లోపల కలిశారా? లేదా అని అడగగా.. వాళ్లు ఎవరు నన్ను కలవలేదు అని అల్లు అర్జున్ సమాధానమిచ్చాడు. మీడియాకి నాపై అవాస్తవాలు ప్రచారం చేశారని బదులిచ్చారు. అవసరమైతే మరోసారి నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు.

మరో సారి విచారణకు రావాల్సి ఉంటుందని.. అందుబాటులో ఉండాలని అల్లు అర్జున్‌కు పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనపై సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు. 

ఈ నెల 4న రాత్రి సంధ్య థియేటర్ పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అనుమతి నిరాకరించినా ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంచల్‌గూ డ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే తాజాగా ఈ కేసులో ఏ18గా పుష్ప 2 సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్‌ను చేర్చినట్లు చిక్కడపల్లి పోలీసులు వెల్లడించారు. 

అల్లు అర్జున్ ఇంటి వద్ద భద్రత పెంపు..

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటీవల అతడి ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు అల్లు అర్జును ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు చేశారు.

పోలీసులు సంధించిన ముఖ్యమైన ప్రశ్నలు..

* పుష్ప-2 ప్రీమియర్‌షోకు సంధ్య థియేటర్‌కు వస్తున్న నేపథ్యంలో ఎవరి అనుమతి తీసుకున్నారు?

* పోలీసులు అనుమతిచ్చారని మీకు ఎవరు చెప్పారు?

* సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా? లేదా? 

* తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా? లేదా? 

* మీడియా ముందు.. నాకు రేవతి మరణవార్త ఎవరు చెప్పలేదని ఎందుకు చెప్పారు? 

* రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా? లేదా? 

* అనుమతి  లేకుండా రోడ్‌షో ఏ విధంగా నిర్వహిస్తారు?

* మీ కుటుంబసభ్యులు ఎవరెవరు సినిమా థియేటర్‌కు వచ్చారు?

* మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఎజెన్సీకి సంబంధించినవారు?

* మొత్తం ఎంతమంది బౌన్సర్లను నియమించుకున్నారు?

* అభిమానులు, పోలీసుల మీద దాడిచేసిన బౌన్సర్ల వివరాలు చెప్పండి? 

* సినిమా ప్రారంభమయ్యాక కొద్ది సేపటికే తొక్కిసలాట విషయం తెలిసిన మీరెందుకు సినిమా చూశారు?

* ఏసీపీ మిమ్మల్ని థియేటర్ లోపల కలిశారా? 

* ఒకవేళ థియేటర్ నుంచి వెళ్లాలని ఏసీపీ చెప్పినట్టయితే  మీరెందుకు వెళ్లలేదు?

* తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ముందే థియేటర్ యాజమాన్యానికి చెప్పారా? లేదా?

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితులు

ఏ1 అగమాటి పెదరామిరెడ్డి (థియేటర్ యాజమాని)   

ఏ2 అగమాటి చిన్నరామిరెడ్డి (థియేటర్ యాజమాని)

ఏ3 ఎం.సందీప్ (థియేటర్ పార్ట్‌నర్)

ఏ4 సుమిత్ (పార్ట్‌నర్)

ఏ5 అగమాటి వినయ్ (పార్ట్‌నర్)

ఏ6 అశుతోష్‌రెడ్డి (పార్ట్‌నర్)

ఏ7 రేణుకాదేవి (పార్ట్‌నర్)

ఏ8 అరుణారెడ్డి (పార్ట్‌నర్)

ఏ9 నాగరాజు (మేనేజర్)

ఏ10 విజయ్‌చందర్ (లోయర్ బాల్కనీ ఇంచార్జ్) 

ఏ11 అల్లు అర్జున్ (హీరో)

ఏ12 సంతోష్ (అల్లు అర్జున్ పీఏ) 

ఏ13 శరత్ బన్నీ (అల్లు అర్జున్ మేనేజర్)

ఏ14 రమేష్ (సెక్యూరిటీ టీమ్)

ఏ15 రాజు (సెక్యూరిటీ టీమ్)

ఏ16 వినయ్‌కుమార్ (ఫ్యాన్స్ అసోసియేషన్)

ఏ17 ఫర్వేజ్(బాడీ గార్డ్)

ఏ18 మైత్రీ మూవీస్ ప్రొడ్యూసర్స్

కేసు వెనక్కి తీసుకుంటాను: శ్రీతేజ్ తండ్రి భాస్కర్ 

మావల్ల అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారనే బాధతో కేసు వెనక్కి తీసుకునేం దుకు మేం సుముఖంగా ఉన్నామని, నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ అన్నారు. అల్లు అర్జున్ మేనేజర్స్ ప్రతిరోజూ వచ్చి బాలుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారని తెలిపారు. మంగళవారం సాయంత్రం కిమ్స్ ఆసుపత్రి వద్ద ఆయన మీడియా తో మాట్లాడారు.

‘ఘటన జరిగిన రోజు కీ.. ఇప్పటికీ శ్రీతేజ్ ఆరోగ్యం కొంత మెరుగుపడింది. నాలుగైదు రోజుల నుంచి శరీరంలో కదలికలు ఉన్నాయి. ఇంజక్షన్ ఇస్తే చెయ్యి నొప్పి ఉన్నట్టు స్పందిస్తున్నాడు. రెండ్రోజుల నుంచి కళ్లు తెరిచి చూస్తున్నాడు కానీ, మమ్మల్ని గుర్తు పట్టడం లేదు. మీరు పక్కనే ఉండి పిలిస్తే క్రమక్రమంగా గుర్తు పట్టే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.

నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్నాం. ఇంకా గుర్తుపట్టలేదు. పూర్తిగా కోలుకునేందు కు ఎంత సమయం పడుతుందో స్పష్టం గా చెప్పలేమని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి షిఫ్ట్ చేశారు. వెంటిలేటర్ సపోర్టు తీసేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి రూ. 50 లక్షలు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ. 25 లక్షల చెక్కు, అల్లు అర్జున్ నుంచి రూ. 10 లక్షల డీడీ అందింది. 

బాబు ఎప్పటికి క్యూర్ అవుతాడో తెలియదు. నాకు అందరి సహకారం కావా లి.  ఘటన జరిగిన రెండో రోజు నుంచే అల్లు అర్జున్ నాకు అండగా ఉన్నారు. ఆ సానుభూతితోనే కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పా. ఆ రోజు థియేటర్ లోప ల ఏం జరిగిందనే దానిపై నాకు క్లారిటీ లేదు. నేను కూడా మీడియాలో చూశా. దర్శకుడు సుకుమార్ ఫ్యామిలీ కూడా రెండుసార్లు ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు’ అని భాస్కర్ మీడియాకు వెల్లడించారు.