calender_icon.png 20 October, 2024 | 5:07 AM

కుటుంబమంతా కలిసి చూడదగ్గ ‘పురుషోత్తముడు’

25-07-2024 12:05:00 AM

ఈ నెల 26న ‘పురుషోత్తముడు’ సినిమాతో తెరపై కనపడనున్నారు కథానాయకుడు రాజ్ తరుణ్. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ సంస్థలో నిర్మితమైన ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. విడుదల సమీపిస్తున్న తరుణంలో దర్శక, నిర్మాతలు బుధవారం పాత్రికేయులతో సమావేశమయ్యారు. దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ “ఓ పత్రికలోని వార్త ద్వారా ‘పురుషోత్తముడు’ కథ మొదలైంది. కోటీశ్వరుడైన ఒక అబ్బాయి పల్లెటూరికి ఎందుకు వచ్చాడు.. అక్కడ ఏం చేశాడు? అనేది కథ. మన కథల్ని లైన్‌గా అనుకుంటే ఎన్నో సినిమాలు ఒకేలా అనిపిస్తాయి.

అయితే ఆ కథలో ఏం చెప్పాం అనేది ముఖ్యం. ఈ సినిమా ఇప్పటిదాకా రాని కథాంశంతోనే చేశాం. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, ముఖేశ్ ఖన్నా, మురళీ శర్మ వంటి నటీనటులతో పాటు గోపీసుందర్, పీజీ విందా వంటి ఉత్తమ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేశారు. ఇందులో నిర్మాతల సహకారం ఎన్నదగ్గది” అన్నారు. “వ్యాపార రీత్యా నేను ముంబై వెళ్లి చాలా కాలమవుతోంది. అయితే సినిమాల మీద అభిమానంతో పరిశ్రమలోకి వచ్చాను.  మంచి తెలుగు సినిమా నిర్మించాలనే ఉద్దేశంతో ‘పురుషోత్తముడు’ సినిమా తీయడం జరిగింది.

డబ్బు పెట్టడానికే పరిమితం కాకుండా సినిమా రూపకల్పనకి సంబంధించిన అన్ని విషయాలపై అవగాహన తెచ్చుకుంటూ ఈ సినిమా చేశాం. నాణ్యతకే మా ప్రాధాన్యత. ఆ క్రమంలో నిర్మాణాంతర పనులకు ఆరు నెలలు వెచ్చించాం. ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు, ద్వందార్థాలు ఉండవు. మా ‘పురుషోత్తముడు’ సకుటుంబంగా చూడదగ్గ చిత్రం” అని నిర్మాత డాక్టర్ రమేశ్ తేజావత్ తెలిపారు.