అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి :
మహాత్మాగాంధీ మహామహా గ్రంథాలు రాసి ఉండకపోవచ్చు. కానీ, ఆయన ఉపన్యాసాలు పుస్తకాల రూపంలోకి వచ్చి తనకొక రచయితగా గుర్తింపు నిచ్చాయి. గాంధీజీ ఒక మంచి రచయిత అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహమూ ఉండక్కర్లేదు. తన ‘ఆత్మకథ’ను వారి ప్రధాన రచనగా భావించినప్పుడు అందులోని శైలీ, శిల్పాలు అద్భుతం. ఏదీ దాచుకోకుండా మనసు విప్పి చెప్పిన ఆయా సంఘటనలు భావోద్వేగాలనూ కలిగిస్తాయి.
అయితే, ‘ఆత్మకథ’లోని ఆఖరి అధ్యాయం అత్యంత ఆసక్తికరమైంది. తదనంతర సంఘటలకు ఆయన ఎందుకు అక్షరరూపం ఇవ్వలేదు? ఏ కారణంగా మధ్యలోనే, అక్కడితోనే ముగించవలసి వచ్చింది? వంటి సందేహాలను ఇందులో ఆయనే నివృత్తిలో చేశారు. ‘విజయక్రాంతి’ పాఠకుల కోసం అందులోని చివరి భాగం ఇక్కడ.
- ఎడిటర్
ఇక ఈ ప్రకరణాల్ని ముగించవలసిన సమయం ఆసన్నమైంది. ఆ తరువాత నా జీవితం పూర్తిగా ప్రజామయం అయిపోయింది. ప్రజలకు తెలియని అంశం అంటూ నా జీవనంలో ఏమీ మిగలలేదు. 1921 నుండి జాతీయ కాంగ్రెసు నాయకులందరితో అమితంగా మమేకం అయిపోయాను.
ఏమి రాయలన్నా నాయ-కులకు సంబంధించిన ఘట్టాలను వర్ణించకుండా వుండలేని స్థితి ఏర్పడింది. వారితో నాకు బహుదగ్గరి సంబంధం ఏర్పడింది. శ్రద్ధానంద్, దేశబంధు, లాలాజీ, హకీం సాహబ్ ఇప్పుడు మన మధ్య లేరు. అదృష్టవశాత్తు ఇతర పలువురు నాయకు-లు మన మధ్య వున్నారు. జాతీయ కాంగ్రెస్‌లో వచ్చిన మార్పును గురించిన చరిత్ర ఇప్పుడు వ్రాయబడుతూ వున్నది.
నా ప్రధాన ప్రయోగాలన్నీ కాంగ్రెస్ ద్వారానే జరిగాయి. ఆ ప్రయోగాలను గురించి వ్రాయ పూనుకుంటే ఆ నాయకుల్ని గురించి వ్రాయక తప్పదు. శిష్టత దృష్ట్యాకూడా ఆ విషయాలను ఇప్పుడు వ్రాయలేను. ఇప్పుడు నేను చేస్తున్న ప్రయోగాలను గురించిన నా నిర్ణయాలు నిర్ణయాత్మకాలుగా పరిగణింపబడవు. అందువల్ల ఈ ప్రకరణాలను తాత్కాలికంగా ఆపివేయ-డం అవసరమని భావిస్తున్నాను.
నా కలం ఇక ముందుకు సాగనంటున్నది అని చెప్పగలను. పాఠకుల దగ్గర సెలవు తీసుకోవలసి వచ్చినందుకు విచారంగా వుంది. నా ప్రయోగాలకు నా దృష్టిలో అమిత విలువ వుంది. వాటిని యథాతథంగా వర్ణించకలిగానో లేదో నాకు తెలియదు. యధార్థ చిత్రణ చేయాలని నా మటుకు నేను అమితంగా కృషి చేశాను.
సత్యాన్ని నేను ఏ విధంగా చూచానో, ఏ రూపంలో చూచానో, ఆ రూపంలో దాన్ని వివరించడానికి సదా ప్రయత్నించాను. ఈ ప్రయోగాల వల్ల పాఠకుల మనస్సులో సత్యం, అహింసలపై అధికంగా విశ్వాసం ఏర్పడుతుందని నా నమ్మకం. సత్యం కంటే మించి మరో భగవంతుడు వున్నాడనే అనుభవం నాకు కలుగలేదు. సత్యమయం కావడానికి అహింసయే ఏకైక మార్గం.
ఈ విషయం ఈ ప్రకరణాల ప్రతి పేజీలో వెల్లడి కాకపోతే నా కృషి అంతా వ్యర్థమేనని భావిస్తున్నాను. ప్రయత్నాలు వ్యర్థం అయితే కావచ్చు కాని మాటలు వ్యర్ధం కావు కదా! నా అహింస సత్యమయం అయినా అది ఇంకా అపూర్ణమే. అపరిపక్వమే. వేలాది సూర్యుల్ని ప్రోగు చేసినా, సత్యమనే సూర్యుణ్ణి చూడలేం. అంత తీక్షణమైంది సత్యం. అయినా ఆ సూర్యుని కిరణాన్ని మాత్రం దర్శించవచ్చు.
అహింస లేనిదే అట్టి దర్శనం లభించడం సాధ్యం కాదు. ఇప్పటి వరకు జీవితంలో పొందిన అనేక అనుభవాల నాధారంగా చేసుకొని ఈ మాట చెబుతున్నాను. ఇట్టి వ్యాప్తి చెందిన సత్యనారాయణుని సాక్షాత్కారం కోసం ప్రతి జీవిని ప్రతి ప్రాణిని ఆత్మ స్వరూపంలో ప్రేమించడం చాలా అవసరం. అట్టి అభిలాషగల మనిషి జీవన స్రవంతికి దూరంగా వుండలేడు.
అందువల్ల సత్యారాధనయే నన్ను రాజనీతిలోకి దింపింది. ధర్మానికీ రాజనీతికి సంబంధం లేదని చెప్పేవారికి ధర్మమంటే ఏమిటో తెలియదని గట్టిగా చెప్పగలను. అలా చెప్పడం అవిధేయత కానేరదు. ఆత్మశుద్ధి లేనిదే ప్రతిజీవితో సమైక్యత ఏర్పడదు. ఆత్మశుద్ధి లేనిదే అహింసా ధర్మపాలన సాధ్యపడదు.
ఆశుద్ధాత్మ పరమేశ్వరుని దర్శనం పొందలేదు. అందువల్ల జీవ-నరంగంలో ప్రతిభాగం పరిశుద్ధంగా ఉండటం అవసరం. ఇట్టి శుద్ధి సర్వులకు సాధ్యమే. వ్యష్టికి సమిష్టికి మధ్య ఎంతో దగ్గర సంబంధం వున్నది. ఒక వ్యక్తి శుద్ధి అనేకుల శుద్ధికి తోడ్పడుతుంది. వ్యక్తిగతంగా ప్రయత్నించగల శక్తి సామర్థ్యాలను సత్యనారాయణుడు సర్వులకు పుట్టుక నుండే ప్రసాదించాడు.
అయితే, శుద్ధి సాక్షాత్కారం భయంకరమైంది. అట్టి అనుభవం ప్రతి క్షణం నేను పొందుతూ వున్నాను. శుద్ధి కావడమంటే మనోవాక్కాయ కర్మేణ నిర్వికారుడు కావడమే. రాగద్వేష రహితుడు కావడమే. ఇట్టి నిర్వికార ప్రవృ-త్తిని అలవరుచుకొనుటకు ప్రతిక్షణం ప్రయత్నిస్తున్నప్పటికీ నేను ఆ స్థితిని ఇంకా అందుకోలేదు. ప్రజలు నన్ను ఎంత పొగడినా, ఆ పొగడ్త నన్ను ఏమరుపాటులో పడవేయదు.
అట్టి పొగడ్త నా మదిలో గుచ్చుకుంటూ వుంటుంది. మనస్సులోగల వికారాలను జయించడం ప్రపంచాన్ని శస్త్రాస్త్రాల యుద్ధంలో జయించడం కంటే కష్టమైందని నాకు కలిగిన అనుభవం. హిందూ దేశానికి వచ్చిన తరువాత కూడా నా మనస్సులో గల వికారాలను చూచాను. చూచి సిగ్గు పడ్డాను. కాని ధైర్యం మాత్రం సడలనీయలేదు. సత్యశోధన కావించుతూ రసానందం పొందాను.
ఇప్పుడూ పొందుతూ వున్నాను. కంటకావృతమైన మార్గం దాట వలసియున్నదని నాకు తెలుసు. అందు నిమిత్తం నేను శూన్యుణ్ణి అయిపోవాలి. మానవుడు తన ఇష్టప్రకారం అందరికంటే వెనుక తనను నిలబెట్టుకోవాలి. అందరి కంటే తాను బహుతక్కువ వాడనని భావించాలి.
ఆ స్థితికి చేరుకోనంతవరకు ముక్తి పొంద-లేడు. అహింస వినమ్రతకు పరాకాష్ఠ. వినమ్రతను అలవరుచుకోనిదే ఏ కాలంలోను ముక్తి లభించదని అనుభవం మీద చెబుతున్నాను. అట్టి వినమ్రత కోసం ప్రార్థిస్తూ, అందుకు విశ్వసహాయాన్ని యాచిస్తూ ఈ ప్రకరణాలను ముగిస్తున్నాను.
‘సత్యశోధన’ (ఆత్మకథ-) నుంచి..